Share News

KTR: కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABN , Publish Date - Mar 27 , 2025 | 04:40 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మర్రూరు మాజీ సర్పంచ్‌ నకిరేకంటి నరేందర్‌ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు.

KTR: కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

నకిరేకల్‌లో మర్రూరు మాజీ సర్పంచ్‌ నరేందర్‌ ఫిర్యాదుతో నమోదు

  • పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో తనపై

  • కావాలనే దుష్ప్రచారం చేసి అవమానించారని ఆరోపణ

  • నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, కాంగ్రెస్‌ నేత ఉగ్గిడి శ్రీనివా్‌సల ఫిర్యాదులతో మరో 2 కేసులు

  • మొత్తం 3 కేసుల్లో కేటీఆర్‌, కొణతం దిలీప్‌, మన్నె క్రిశాంక్‌,

  • తెలుగు స్ర్కైబ్‌, టీ న్యూస్‌, తెలుగు మిర్రర్‌పై ఫిర్యాదులు

నల్లగొండ/కామారెడ్డి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మర్రూరు మాజీ సర్పంచ్‌ నకిరేకంటి నరేందర్‌ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. ఈ నెల 21న పదో తరగతి తెలుగు-1 ప్రశ్నపత్రం లీక్‌ ఘటనలో బాధ్యులుగా ఇటీవల 12మందిని రిమాండ్‌ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. అయితే, నిందితుల్లో ముగ్గురు నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులకు సన్నిహితులుగా పేర్కొంటూ తెలుగు స్ర్కైబ్‌ యూట్యూబ్‌(వెబ్‌), టీ న్యూస్‌ ఛానెల్‌, తెలుగు మిర్రర్‌ ఛానల్స్‌లో అసత్యాలు ప్రచారం చేశారని, వాటిని కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం కన్వీనర్‌ కొణతం దిలీప్‌, ఆ పార్టీ నేత మన్నె క్రిశాంక్‌ తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో ఫార్వర్డ్‌ చేశారని, తనపై నిందలు వేసి అవమానించారని నరేందర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు కేటీఆర్‌పై ఇదే పోలీస్‌ స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు కేసుల్లో కేటీఆర్‌తో పాటు దిలీప్‌, క్రిశాంక్‌, తెలుగు స్ర్కైబ్‌, టీ న్యూస్‌ ఛానల్‌, తెలుగు మిర్రర్‌ ఛానల్స్‌, వాటి ఎండీలపైనా కేసులు నమోదు చేశారు. బాధ్యత గల పదవిలో ఉన్న తనకు కళంకం తెచ్చేలా దుష్ప్రచారం చేశారని నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగాని రజిత ఒక కేసు పెట్టగా, కాంగ్రెస్‌ నాయకుడు ఉగ్గిడి శ్రీనివాస్‌ మరో కేసు పెట్టారు. ఈ మూడు ఫిర్యాదులను స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు నకిరేకల్‌ సీఐ రాజశేఖర్‌ పేర్కొన్నారు.


బండి శ్రీను నా డ్రైవర్‌ కాదు: నరేందర్‌

ప్రశ్నపత్రం లీక్‌ కేసులో నిందితుడిగా ఉన్న బండి శ్రీను తనకు ఏ సమయంలోనూ డ్రైవర్‌గా పనిచేయలేదని నరేందర్‌ తన ఫిర్యాదులో తెలిపారు. కేవలం తనని అవమానపరచడానికే బీఆర్‌ఎస్‌ నాయకులు, వారి అనుకూల ఛానళ్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని ఆరోపించారు. ‘‘పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ కేసులో పోలీసులు రిమాండ్‌ చేసిన బండి శ్రీను మర్రూరు మాజీ సర్పంచ్‌ నరేందర్‌ డ్రైవర్‌. బండి శ్రీనును నరేందరే ఉసిగొల్పి ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేయించారని తెలుగు స్రైబ్‌, టీన్యూ్‌సలో అసత్యాన్ని ప్రసారం చేశాయి. వాటిని నిర్ధారించుకోకుండా కేటీఆర్‌, దిలీప్‌ ఫార్వర్డ్‌ చేశారు’’ అని నరేందర్‌ తెలిపారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో, పోలీసులు కేటీఆర్‌ను ఏ-1గా, దిలీ్‌పను ఏ-2గా, టీ న్యూస్‌ ఛానల్‌ మేనేజ్‌మెంట్‌, తెలుగు స్ర్కైబ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ (వెబ్‌)ని ఏ-3గా కేసు నమోదు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రిమాండ్‌ చేసిన చిట్ల ఆకాశ్‌ను తన డ్రైవర్‌గా పేర్కొన్నారని, ప్రశ్నపత్రాల లీకేజీలో తన ప్రమేయం ఉన్నట్లు అసత్య ప్రచారం చేశారని చౌగాని రజిత చేసిన ఫిర్యాదుతో రెండో కేసు నమోదైంది. ఆకాశ్‌ తమకు ఏనాడూ డ్రైవర్‌గా పనిచేయలేదని రజిత తెలిపారు. ఈ ఫిర్యాదులో ఏ-1గా క్రిశాంక్‌, ఏ-2గా కేటీఆర్‌, ఏ-3గా దిలీప్‌, టీన్యూస్‌, తెలుగు స్ర్కైబ్‌ వెబ్‌ పైన కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు ఉగ్గిడి శ్రీనివాస్‌ ఫిర్యాదులో ఏ-1గా దిలీప్‌, ఏ-2గా క్రిశాంక్‌, ఏ-3గా కేటీఆర్‌తోపాటు తప్పుడు ప్రసారాలు చేసినందుకు ఏ-4గా తెలుగు స్ర్కైబ్‌ ఎండీ, ఏ-5గా మిర్రర్‌ టీవీ యూట్యూబ్‌ ఛానెల్‌ ఎండీతో పాటు ఇతర ఛానెల్స్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. తాను నకిరేకల్‌లోని గౌతమి స్కూల్‌ యాజమాన్యంతో కుమ్మక్కై, వారి కోసం గుడుగుంట్ల శంకర్‌ ద్వారా పేపర్‌ లీక్‌ చేయించానని అసత్య ప్రచారం చేసినట్లు శ్రీనివాస్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


కామారెడ్డి జుక్కల్‌లో గణితం ప్రశ్నలు లీక్‌?

కామారెడ్డి జిల్లా జుక్కల్‌లోని పదోతరగతి పరీక్ష కేంద్రం నుంచి బుధవారం గణితం ప్రశ్నాపత్రంలోని 5ప్రశ్నలు(13,14,15,16,17) లీకైనట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తెల్లకాగితంపై ఈ ప్రశ్నలు రాసి ఉన్న ఫొటోలు బుధవారం బయటకు వచ్చాయి. ఈ విషయమై జిల్లా అధికారులు సైతం విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో ముగ్గురు సిబ్బందిపై డీఈవో రాజు సస్పెన్షన్‌ వేటు వేశారు. సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌ సునీల్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ భీమ్‌, ఇన్విజిలేటర్‌ దీపికలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. లీకేజీలో మరికొందరి పాత్రపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 27 , 2025 | 04:41 AM