Amazon: అమెజాన్ గోదాంపై బీఐఎస్ దాడులు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:32 AM
హైదరాబాద్‌లోని అమెజాన్ గోదాంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి నిల్వ చేసిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున సీజ్ చేశారు.

ధ్రువీకరణ లేని 2,783 ఉత్పత్తులు సీజ్
వాటి విలువ రూ.50 లక్షల పైనే..
హైదరాబాద్ సిటీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని అమెజాన్ గోదాంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి నిల్వ చేసిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున సీజ్ చేశారు. బీఐఎస్ హైదరాబాద్ శాఖాధిపతి పీవీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎయిర్‌పోర్ట్ సిటీలో ఉన్న గోదాంలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు తనిఖీలు చేశారు. ఇందులో దాదాపు రూ.50 లక్షల పైగా విలువైన 2,783 ఉత్పత్తులకు బీఐఎస్ ధ్రువీకరణ, ఐఎ్‌సఐ మార్క్, ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులకు ఉండాల్సిన రిజిస్ట్రేషన్ మార్కు లేవని గుర్తించారు.
ఆ ఉత్పత్తులను జప్తు చేశారు. వీటిలో 1,937 స్టెయిన్ లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, 150 స్మార్ట్ వాచ్‌లు, 326 వైర్‌లెస్ ఇయర్ బడ్స్, 170 మొబైల్ చార్జర్లు తదితరాలున్నాయి. దీనిపై పీవీ శ్రీకాంత్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం బీఐఎస్ ధ్రువీకరణను తప్పనిసరి చేసిందని, ఐఎ్‌సఐ మార్కు, ఎలకా్ట్రనిక్ వస్తువులకు రిజిస్ట్రేషన్ మార్కు ఉండాలని చెప్పారు. బీఐఎస్ అనుమతి పొందకుండా తయారుచేసినా, విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. జరిమానతో పాటు జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. వస్తువుల నాణ్యతా ప్రమాణాలను బీఐఎస్ కేర్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చని, ఉల్లంఘనలను గుర్తిస్తే అందులో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.