FLATS FOR SALE : ఫ్లాట్లు.. అమ్మకానికి పాట్లు

ABN , First Publish Date - 2023-08-18T05:14:15+05:30 IST

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) దేశంలోని 9 ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఫ్లాట్ల సంఖ్య 5,26,914.

 FLATS FOR SALE : ఫ్లాట్లు.. అమ్మకానికి పాట్లు

విక్రయం కానివి ఎక్కువున్న 9 నగరాల్లో 2వ స్థానంలో హైదరాబాద్‌

తొలి త్రైమాసికంలో అమ్ముడుపోని ఫ్లాట్లు 99,989

నానాటికీ పెరుగుతున్న ధరలే ప్రధాన కారణం

పెట్టుబడులకు మధ్యతరగతి, ఎన్నారైల విముఖత

‘కోకాపేట’ వందకోట్ల ధరతో ప్రతికూలతలే ఎక్కువ

రియల్‌ ఎస్టేట్‌ విశ్లేషణ సంస్థ అధ్యయన నివేదిక

రియల్‌ ఎస్టేట్‌ విశ్లేషణ సంస్థ అధ్యయన నివేదిక

హైదరాబాద్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) దేశంలోని 9 ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఫ్లాట్ల సంఖ్య 5,26,914. ఇందులో హైదరాబాద్‌ వాటా 99,989. ఇలా కట్టి సిద్ధంగా ఉన్న అపార్ట్‌మెంట్లలో.. అమ్ముడుకాకుండా మిగిలిపోయిన ఫ్లాట్ల సంఖ్యలో హైదరాబాద్‌ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. 1,07,179 అమ్ముడుకాని ఫ్లాట్లతో.. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని థానే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థికరాజధాని ముంబైలోనూ అమ్ముడుపోని ఫ్లాట్ల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ.. గత త్రైమాసికంతో పోలిస్తే ఆ సంఖ్య తగ్గడం గమనార్హం. హైదరాబాద్‌, పుణె, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో మాత్రం అన్‌సోల్డ్‌ ఫ్లాట్ల సంఖ్య పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ విక్రయాలను అధ్యయనం చేసే ప్రముఖ వెబ్‌సైట్‌ ప్రాప్‌ ఈక్విటీ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. కృత్రిమ మేధ సహాయంతో ఈ వెబ్‌సైట్‌ దేశంలోని 9 ప్రధాన నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ విశ్లేషిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2023-2024 - ఏప్రిల్‌, మే, జూన్‌) రియల్‌ వ్యాపారానికి సంబంధించిన వివరాలను ఈ సంస్థ తాజాగా విడుదలచేసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణే, థానే నగరాల్లో అమ్ముడుపోని ఫ్లాట్ల వివరాల గురించి అందులో పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. గత త్రైమాసికంతో పోలిస్తే హైదరాబాద్‌లో అమ్ముడుకాని ఫ్లాట్లు 95,106 నుంచి 99,989కి.. అంటే 5 శాతం మేర పెరిగాయి.

ఎందుకిలా?

సాధారణంగా మనదేశంలో ఫ్లాట్ల విక్రయాల్లో మధ్యతరగతి, ఎన్నారైల వాటా మెజారిటీగా ఉంటుంది. తమ జీవితకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొంటే.. ఎన్నారైలు పెట్టుబడుల కోణంలో కొంటుంటారు. అయితే నగరంలో నానాటికి పెరుగుతున్న ఫ్లాట్ల ధరల కారణంగా మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలకు దూరం అవుతున్నట్టు వెబ్‌సైట్‌ విశ్లేషించింది. ఐటీలో ఉద్యోగుల కోత, ఉద్యోగ అభద్రత ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగటంతో వారు కొనుగోళ్లకు ఆసక్తి చూపట్లేదు. పైగా.. హైదరాబాద్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 3బీహెచ్‌కే ఫ్లాట్‌ ధర ఏడాది క్రితం వరకూ రూ.కోటిగా ఉండేది. అదిప్పుడు దాదాపు రూ.కోటిన్నరకు చేరింది. ధరలు పెరగటం, ఈఎంఐలు ఎక్కువగా ఉండటంతో ఐటీ ఉద్యోగులూ ఫ్లాట్ల కొనుగోలుకు విముఖత చూపిస్తున్నారని వెబ్‌సైట్‌ విశ్లేషించింది.

ప్రభుత్వ చర్యతో మరిన్ని కష్టాలు

కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లకు పైగా పలకడం తెలంగాణ పరపతికి నిదర్శనమని, అభివృద్ధికి సూచిక అని సీఎం కేసీఆర్‌ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, దీని వెనక ప్రభుత్వ హస్తం ఉందని.. అది కృత్రిమ పెంపు అనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. నష్టాల్లో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ను పెంచాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతోందన్న విమర్శలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. కుదేలైన రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకే నగరం నలువైపులా ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నెలకొల్పుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు.. నాలుగేళ్ల క్రితం నగరానికి దక్షిణాదిన ప్రభుత్వం ఫార్మా సిటీ ప్రాజెక్టును ప్రకటించింది. దాన్ని ఇంతవరకు పూర్తిచేయకపోయినా.. అక్కడ భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. భవిష్యత్తు పెట్టుబడులకు కొనుగోలుచేసినవారు ఇప్పుడు.. 20-30 శాతం తగ్గింపు ధరలకు విక్రయించినా.. కొనేవారు కనిపించని పరిస్థితి. అలాగే.. ఎన్నికల ముందు మెట్రో విస్తరణ సైతం రియల్‌ ఎస్టేట్‌ ధరల పెంపులో భాగమేనన్న విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేల కోట్లతో మెట్రోను విస్తరించడం దాదాపు అసాధ్యం. అయినా ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగం కోసమే ఆ ప్రకటన చేసిందంటున్నారు. దీనివల్ల భూముల ధరలు భారీగా పెరిగి.. మధ్యతరగతి ప్రజలు సొంతింటి కలకు దూరం అవుతారని నిపుణులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

Updated Date - 2023-08-18T05:14:15+05:30 IST