Hyderabad: పబ్బు వెనుక పవర్ గబ్బు.. ఆ మసక చీకట్ల మాటున నేతలు, ఉన్నతాధికారులు
ABN , Publish Date - Dec 19 , 2023 | 10:38 AM
జూబ్లీహిల్స్‌లో ఓ మాజీ ఎమ్మెల్యే(Former MLA)కు ఉన్న రెండు పబ్‌లకు నాయకుల పిల్లలతో పాటు ప్రముఖులు వస్తుంటారు.

- అర్ధరాత్రి దాటినా నిర్వహణ.. తనిఖీకి వెళ్తే హెచ్చరికలు
- మేమున్నంతసేపూ లోపలికి రావొద్దని బెదిరింపులు
- దీన్నే అలుసుగా తీసుకుని నిర్వాహకుల ఇష్టారాజ్యం
- హైదరాబాద్‌లో తలలు పట్టుకుంటున్న పోలీసులు
- పబ్‌లకు అడ్డుకట్ట వేస్తే డ్రగ్స్ గోల సగం తీరినట్లే!
- కొత్త సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కన్నెర్రతోనైనా మారేనా?
హైదరాబాద్ వెస్ట్ జోన్ పరిధిలో అదో ప్రముఖ పబ్. సెలిబ్రిటీలు నిత్యం అక్కడే ఉంటారు. ఇదే పబ్‌కు ఓ ఉన్నతాధికారి వస్తుంటారు. ఓసారి పోలీసులు తనిఖీకి వెళ్లగా.. ‘‘సార్ ఉన్నారు. లోనికి రావొద్దు’’ అంటూ సదరు అధికారి భద్రతా సిబ్బంది వారించారు. ఇదే అదనుగా ఉన్నతాధికారి లేని సమయంలోనూ పోలీసులు రాకుండా పబ్ నిర్వాహకులు బెదిరిస్తున్నారు.
బంజారాహిల్స్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌లో ఓ మాజీ ఎమ్మెల్యే(Former MLA)కు ఉన్న రెండు పబ్‌లకు నాయకుల పిల్లలతో పాటు ప్రముఖులు వస్తుంటారు. సమయం ముగిశాక కూడా నడుస్తుండడంతో పోలీసులు దాడులు చేయగా నేతల నుంచి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. పైకి తిరిగి.. మామూళ్లు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు తనిఖీలు నిలిపివేశారు. హైదరాబాద్‌లో వేగంగా విస్తరిస్తున్న పబ్ కల్చర్ మాటున నిర్వాహకుల పెత్తనం శ్రుతి మించుతోంది. అత్యధిక శాతం పబ్‌లు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. దీంతో కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. గతంలో పబ్‌లపై పోలీసులకు అదుపు ఉండేది. నేతలు, ఉన్నతాధికారుల జోక్యం పెరగడంతో ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నారు. అలా.. పబ్‌లలోకి డ్రగ్స్, గంజాయి ప్రవేశిస్తున్నాయి. వాస్తవానికి పబ్‌లను నియంత్రిస్తే డ్రగ్స్ దందా సగం తగ్గుతుందనేది పోలీసుల భావన. నిబంధనల ప్రకారం రాత్రి 12 దాటినా నిర్వహిస్తే కేసు నమోదు చేయాలి. అయితే, ఉన్నతాధికారులు స్నేహితులతో పబ్‌లో కూర్చుని దర్పం ప్రదర్శిస్తూ ఉల్టా పోలీసులనే హెచ్చరిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి ప్రవర్తన మరీ ఇబ్బందిగా మారింది. నెలకోసారి సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పరిధిలోని పబ్‌కు వెళ్లే ఆయన ఎంతకూ బయటకు రాకుండా పోలీసులను బెదిరిస్తుంటారు. మరో పోలీస్ రిటైర్డ్ ఉన్నతాధికారి వీకెండ్ రాగానే పదిమంది స్నేహితులతో పబ్‌లో దిగిపోతారు. బిల్లులో 50 శాతం రాయితీ కావాలని గొడవపడుతుంటారు.
70 శాతం నేతలు, వారి పిల్లల చేతుల్లోనే..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 62 పబ్‌లున్నాయి. వీటిలో 70 శాతం పబ్‌లలో నాయకులు, వారి వారసుల పెట్టుబడులున్నాయి. లాభాల కోసం అర్ధరాత్రి తర్వాత కూడా వీటిని నడిపిస్తున్నారు. చిన్న కేసు పెట్టినా పోలీసులపై నేతలు చిందులు తొక్కుతున్నారు. రాడిసన్ బ్లూ ప్లాజాలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ విషయంలో ఇదే జరిగింది. గతేడాది టాస్క్‌ఫోర్స్ తనిఖీకి వెళ్లగా పబ్ నిర్వాహకుడి బంధువైన మాజీ ఎంపీ విరుచుపడ్డారు. అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచినందుకు బంజారాహిల్స్ పోలీసులు కేసు పెడితే వారం పాటు ఉన్నతాధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు పంచాయితీలు జరిగాయి. ఇప్పుడు పోలీసులు ఈ పబ్ వైపు చూడడం లేదు. కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి యాజమాన్యంలోని మరికొన్ని పబ్‌లకు పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయి. తనిఖీకి వెళ్తే ఫోన్లు వస్తుండడంతో స్థానిక పోలీసులు మిన్నకుంటున్నారు. మిగిలిన పబ్‌ల విషయంలో కొందరు పోలీసులకు భారీగా మామూళ్లు వెళ్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి చార్జ్ తీసుకున్న వెంటనే డ్రగ్స్‌పై దృష్టిసారించారు. ఆయన ఆదేశాలతో పోలీసులు బృందాలుగా ఏర్పడి పబ్‌లలో తనిఖీలు చేపట్టారు. జాగిలాలను కూడా రంగంలోకి దించారు. అయితే, ఇది ఆరంభ శూరత్వంగా మిగిలిపోకూడదని కొందరు అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజులు హడావుడి చేసి తర్వాత మిన్నకుండే పద్ధతి పోవాలని సూచిస్తున్నారు.
