Hyderabad: మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష: డీజీపీ
ABN , Publish Date - Dec 31 , 2023 | 10:05 AM
హైదరాబాద్: డిసెంబరు 31 ఆదివారం రాత్రి కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు జరుగుతాయని, మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష పడుతుందని...
హైదరాబాద్: డిసెంబరు 31 ఆదివారం రాత్రి కొత్త సంవత్సర వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. ఈరోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు జరుగుతాయని, మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, జైలు శిక్ష పడుతుందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. న్యూఇయర్ వేడుకల వేళ హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించినట్లు డీజీపీ చెప్పారు.
న్యూయర్ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఫ్లైఓవర్, ఔటర్‌రింగ్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ సీపీ వెల్లడించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం వెళ్లే వాహనదారులకు పాసులు తప్పనిసరి అన్నారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కేసులు పెడతామన్నారు. క్యాబ్, ఆటో డ్రైవర్స్ రైడ్స్ నిరాకరించొద్దని సూచించారు. పబ్, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చర్యలుంటాయని, మద్యం సేవించిన కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా వాహనాలు నడిపే వారిపై చర్యలుంటాయన్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తారని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని సీపీ స్పష్టం చేశారు.
సిటీ ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులతోపాటు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనే యువతీ యువకులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచే నగరంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నగరంలో మొత్తం 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని, ఒక్కో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని చెప్పారు. అయితే పబ్‌లు, క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు అధికంగా ఉండే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, పంజాగుట్ట వెస్టుజోన్‌లోని తదితర ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి ఒక్కో పీఎస్ పరిధిలో 5 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా పబ్‌లు, ప్రధాన జంక్షన్‌ల వద్ద నార్కోటిక్ బ్యూరో పరిధిలో డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులు చెప్పిన నియమనింబంధనలకు లోబడి వేడుకలు జరుపుకోవాలన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం, రోడ్డు ప్రమాదాలు చేసి ఇతరుల ప్రాణాలు తీయడం క్షమించరాని నేరమని గుర్తించాలని ఆయన సూచించారు. ఈవెంట్స్ నిర్వాహకులు కూడా కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఏసీపీ విశ్వప్రసాద్ ఆదేశించారు.