కేటీఆర్ ఉడత ఊపులకు బెదరం
ABN , First Publish Date - 2023-03-30T02:16:50+05:30 IST
మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతాం. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు.

లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాటం
ఆయన పరువు విలువ రూ. వంద కోట్లయితే..
30 లక్షల మంది విద్యార్థులకు ఎంత మూల్యం చెల్లిస్తారు?
పరువు నష్టం పేరుతోనూ డబ్బు సంపాదనా?: సంజయ్
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘‘మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతాం. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఆయన ఉడత ఊపులకు బెదిరేది లేదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ పరువు, ప్రతిష్ట విలువ రూ.100 కోట్లయితే.. పేపర్ లీకేజీతో భవిష్యత్తు ప్రశ్నార్థకమైన 30 లక్షల మంది యువతకు ఎంత మూల్యం చెల్లిస్తారని ప్రశ్నించారు. పరువు నష్టం పేరుతోనూ డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో చిప్పలు కడిగే స్థాయి నుంచి ఇప్పుడు రూ.వందల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేటీఆర్ ఒక స్వయం ప్రకటిత మేధావి అని, నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నాడని విమర్వించారు. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడు, పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఞాని అంటూ ధ్వజమెత్తారు. ప్రధాని హోదాను, మోదీ వయసునూ చూడకుండా విమర్శించడం కేటీఆర్ కుసంస్కారానికి నిదర్శనమన్నారు. సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్‌కు ఎలా లీక్ అవుతున్నాయని ప్రశ్నించారు. ఇద్దరు మాత్రమే దోషులని సర్టిఫికెట్ ఇచ్చి.. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించిన కేటీఆర్‌పై పోలీసులు క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టడంలేదని నిలదీశారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ కుంభకోణం నుంచి పేపర్ లీకేజీ కుంభకోణం వరకు ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆరే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు, కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సంజయ్ స్పష్టం చేశారు. మెట్రో రెండో దశ సాధ్యం కాదని కేంద్రం చెప్పిందంటూ మంత్రి కేటీఆర్ అంటున్నారని, ఆ లేఖను బయట పెట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు.
రాహుల్ రాహువు.. కేసీఆర్ కేతువు: బూర నర్సయ్యగౌడ్
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాహువు అయితే.. సీఎం కేసీఆర్ కేతువు అంటూ బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బీసీలపట్ల వివక్ష చూపుతున్నా యన్నారు.