Kakinada Port Scam: కాకినాడ పోర్టులో 40% వాటా లాక్కున్నారు
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:36 AM
కాకినాడ పోర్టు విలువ రూ.2,500 కోట్లు అయినప్పటికీ, వైసీపీ సర్కారు బలవంతంగా 40% వాటాను కేవలం రూ.494 కోట్లకు తీసుకుందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. లోక్‌సభలో కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024పై చర్చ సందర్భంగా, పోర్టు ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరారు

వైసీపీ సర్కారుపై లోక్‌సభలో ఎంపీ లావు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ‘కాకినాడ పోర్టు విలువ సుమారు రూ.2,500 కోట్లు. దానిలో 40ు వాటాను గత వైసీపీ సర్కారు బలవంతంగా రూ.494 కోట్లకు తీసుకుంది’ అని టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. మంగళవారం లోక్‌సభలో కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘కాకినాడ పోర్టు ఆస్తులను రక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే సముద్ర వాణిజ్యం దెబ్బతింటుంది. కాకినాడ పోర్టు లావాదేవీలను ఎలా నిర్వహించారో కేంద్రం పరిశీలించాలి. ఇలాం టి లావాదేవీలు జరిగినప్పుడు పోర్టులో పనిచేసే చాలామంది ప్రజలు, ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. అందుకని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారమివ్వాలి. కోస్టల్ షిప్పింగ్ రంగం అభివృద్ధికి బలమైన భద్రతా యంత్రాంగంతో పాటు నౌకాశ్రయ ఆస్తులను సంరక్షించాల్సిన అవసరం ఉంది. 100-150 ఏళ్లుగా ఉన్న బకింగ్‌హామ్ కెనాల్ గుంటూరు జిల్లా మీదుగా చెన్నై వరకు వెళ్తుంది. దీన్ని అభివృద్ధి చేస్తే షిప్పింగ్, సముద్ర రవాణా ఖర్చులు తగ్గుతాయి. దీనిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఎంపీ లావు కోరారు.