Seetakka: 79 రోజుల తర్వాత ప్రధాని మాట్లాడడం బాధాకరం..
ABN , First Publish Date - 2023-07-20T16:43:30+05:30 IST
హైదరాబాద్: మణిపూర్‌లో దారుణం జరుగుతోందని, 79 రోజుల తర్వాత ప్రధాని మోదీ మాట్లాడడం బాధాకరమని, ఆయనకు ఏం తెలియనట్లుగా చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.
హైదరాబాద్: మణిపూర్ (Manipur)లో దారుణం జరుగుతోందని, 79 రోజుల తర్వాత ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడడం బాధాకరమని, ఆయనకు ఏమీ తెలియనట్లుగా చెబుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (Congress MLA Seetakka) విమర్శించారు. గురువారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తనపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని తగ్గించడానికి మోదీ మాట్లాడారని, మణిపూర్ సంఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందని, కుకీ తెగపై దాడులు, హత్యాచారాలు బాధాకరమని అన్నారు. గత నెలలో రాహుల్ (Rahul) పర్యటనను బీజేపీ సర్కారే (BJP Govt.) అడ్డుకుందని ఆరోపించారు. మణిపూర్ ఘటన మన దేశంలోనే జరిగేది అన్నట్లుగా వుందన్నారు. దీనికి బీజేపీ సర్కార్ వైఫల్యమే కారణమన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు వున్న స్పెషల్ స్టేటస్‌ను తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలే తప్పా మరేం లేవని, పిల్లలు అని చూడకుండా హత్యాచారాలు జరుగుతున్నాయని సీతక్క మండిపడ్డారు.
మణిపూర్ సీఎం కూడా ఇవేం కొత్తవి కాదని చెప్పడం బాధాకరమని, కొట్లాటలు జరుగుతుంటే అక్కడి సీఎం, పీఎం డిస్కస్ చెయ్యలేదా? అని సీతక్క ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇంచార్జిగా వున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కూడా మాట్లాడ్డం లేదని విమర్శించారు. గుజరాత్‌లో మోదీ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటనలో వేలాది మహిళలు చనిపోయారన్నారు. బీజేపీ సర్కార్ రాజకీయం కోసమే తప్పా ప్రజల కోసం మానవత్వం కోసం పనిచేయడం లేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు. యునైటెడ్ ఇండియా టీమ్ (United India Team) కూడా మణిపూర్ కోసం పనిచేస్తోందన్నారు. మణిపూర్‌లో జరిగే ఘటనలు బయటికి రావడం లేదని, ఆర్మీ, నెట్ వర్క్ అంతా బీజేపీ చేతుల్లోనే ఉందని విమర్శించారు. మోదీ ఈ దేశం కోసమే పనిచేస్తున్నారా?.. లేక పక్క దేశం కోసం పనిచేస్తున్నారా?.. అని ప్రశ్నించారు. మణిపూర్ ప్రజలకు మోదీ, అమిత్ షా (Amit Shah), కిషన్ రెడ్డిలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మానవహక్కులు కాలరాసేలా ఘటనలు మణిపూర్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయని సీతక్క అన్నారు.