Delhi: ఉగ్రవాద దాడులకు పథకం రచించిన కేసులో ముగ్గురిపై ఎన్ఐఏ కేసు
ABN , First Publish Date - 2023-02-05T13:55:35+05:30 IST
హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులకు పథకం రచించిన కేసులో అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) కేసు నమోదు చేసింది.
ఢిల్లీ: గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో ఉగ్రవాద దాడులకు పథకం రచించిన కేసులో అరెస్టు అయిన ముగ్గురు వ్యక్తులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కిం
ద జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ (NIA) కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లో పేలుళ్ళకు పాల్పడేందుకు కుట్ర పన్నిన సూత్రధారి అబ్దుల్ జాహిద్ (Abdul Zahid)కు ఉగ్రవాద సంబంధిత కేసులలో ప్రమేయం ఉందని తాజాగా నమోదు చేసిన కేసులో ఎన్ఐఏ పేర్కొంది. లష్కరే తోయిబా (Lashkar-e-Taiba), పాకిస్తానీ (Pakistan) గూఢచార సంస్థ-ఐఎస్ఐతో సంబందాలు ఉన్నాయని, పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్ల సూచనల మేరకు హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర పాన్నినట్లు ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్, ఫరూఖ్ వంటి అనేక మంది యువకులను ఉగ్రవాద కార్యక్రమాల కోసం రిక్రూట్ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. జాహిద్ తన ముఠా సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో పేలుళ్లు జరపడం, ఒంటరి తోడేలు తరహా దాడులు జరపాలని పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించారని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది. ప్రాధమిక ఆధారాలు లభించిన అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయడానికి ఎన్ఐఏ కేంద్ర హోమ్ శాఖ అనుమతి కోరింది.
ఈ ఏడాది జనవరి 25న కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి కేంద్ర హోంశాఖ ఎన్ఐఏకు అనుమతి ఇచ్చింది. దర్యాప్తు సమయంలో నిందితుల నుంచి ఎన్ఐఏ అధికారులు రెండు హ్యాండ్ గ్రనేడ్‌లు, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 3,91,800 స్వాధీనం చేసుకున్నారు. కేసు తీవ్రత, అంతర్జాతీయ సంబంధాల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసు విచారణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.