శివాలయాలు ముస్తాబు
ABN , First Publish Date - 2023-02-13T00:11:34+05:30 IST
నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన పంచభూత భూమేశ్వరస్వామి శివాలయంలో ఈనెల 18న మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహాకులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు.
మారేడ్‌పల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన పంచభూత భూమేశ్వరస్వామి శివాలయంలో ఈనెల 18న మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహాకులు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. కోటిన్నర రూపాయల వ్యయంతో కంటోన్మెంట్ పికెట్‌లో 2013 జనవరిలో గుంటూరులోని కోటప్ప కొండ నుంచి తెచ్చిన కృష్ణశిలలు ఉపయోగించి 45 ఫీట్లతో అందంగా ఈ శివాలయాన్ని నిర్మించారు. ఈ శివాలయానికి 4 ద్వారాలు ఉండడం ఒక ప్రత్యేకత. ఆలయం ముందు 43 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం ఏర్పాటు చేయడంతో పాటు కంచుతో ప్రత్యేకంగా తయారు చేసిన 6 ఫీట్ల 9 ఇంచుల కాలసర్ప కుండలి సర్పంను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పంచ భూత భూమేశ్వరస్వామి శివాలయం స్వరూపం మారిపోనుంది. ఆలయంలోని శివలింగం ఎదుట ఏర్పాటు చేసిన భారీ నందిని భక్తులు భక్తి పారవశ్యంతో దర్శించుకుంటుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అతిపెద్ద శివలింగానికి అభిషేకం చేస్తే చాలు జన్మధన్యమై పోతుందనే భావన భక్తులకు కలుగుతుంది. కాగా పంచభూత భూమేశ్వర శివాలయం చుట్టూ భక్తులు ప్రదర్శన చేయడానికి ఆచారం సాంప్రదాయాలను అమలు పరచడానికి ఆలయ నిర్వాహకులు జెట్టి ఉమేశ్వరరావు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పూర్తి ఏర్పాటు చేయడంతో పాటు వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.