Lal Darwaza Bonalu: ఇది నాకు కొత్తేమీ కాదు.. బోనాల వేడుకలో గవర్నర్ తమిళిసై అసంతృప్తి..!
ABN , First Publish Date - 2023-07-16T14:47:21+05:30 IST
గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి బోనాల వేడుకలకు ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఇది తనకు కొత్తేమీ కాదని, గతకొద్ది రోజులుగా జరుగుతున్న తంతేనని గవర్నర్ తమిళిసై నిట్టూర్పు వెలిబుచ్చారు.
హైదరాబాద్: ఈ ఆదివారం నాడు భాగ్యనగరం బోనమెత్తింది. పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో అట్టహాసంగా బోనాల పండగ జరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై స్వయంగా బోనమెత్తి సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా.. మీడియాతో మాట్లాడిన గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి బోనాల వేడుకలకు ఎలాంటి ఆహ్వానం తనకు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఇది తనకు కొత్తేమీ కాదని, గతకొద్ది రోజులుగా జరుగుతున్న తంతేనని గవర్నర్ తమిళిసై నిట్టూర్పు వెలిబుచ్చారు. ప్రభుత్వ ఆహ్వానాలు అందినా, అందకపోయినా తాను హ్యాపీ అని.. తెలంగాణ ప్రజలే తనకు పరివార్ అని గవర్నర్ తమిళిసై చెప్పడం గమనార్హం. గవర్నర్ తమిళిసైకి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొంత కాలంగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ బిల్లుల ఆమోదం విషయంలో రేగిన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పెండింగ్ బిల్లులను ఆమోదిస్తానని గవర్నర్ తమిళిసై స్పష్టం చేసిన తర్వాత కూడా గవర్నర్ తమిళిసై విషయంలో బీఆర్‌ఎస్ సర్కార్ తీరు మారలేదని తాజా పరిణామం స్పష్టం చేసింది.
గవర్నర్‌గా నరసింహన్ కొనసాగిన సమయంలో తెలంగాణలో ఏ పండుగ జరిగినా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సతీసమేతంగా వెళ్లి మరీ గవర్నర్‌ను ఆహ్వానించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు కనీసం మాట వరసకైనా, మర్యాదకైనా గవర్నర్ తమిళిసైను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఏ పండుగకూ తెలంగాణ ప్రభుత్వం నుంచి గవర్నర్ తమిళిసైకి ఆహ్వానం అందలేదు. తాజాగా.. బోనాల పండుగ సమయంలో కూడా ఇదే జరిగింది. బీఆర్‌ఎస్ సర్కార్‌కు, గవర్నర్ తమిళిసైకి ఈ దూరం ఎప్పటికి తగ్గుతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటుండటం గమనార్హం.