Share News

TSRTC MD: బోధన్‌లో మహిళలకు టికెట్ జారీపై విచారణ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-12-10T22:11:48+05:30 IST

నిజామాబాద్ జిల్లా బోధన్‌ డిపో పరిధిలో మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ విచారణకు ఆదేశించారు.

TSRTC MD: బోధన్‌లో మహిళలకు టికెట్ జారీపై విచారణ.. అసలేం జరిగిందంటే..

నిజామాబాద్ జిల్లా బోధన్‌ డిపో పరిధిలో మహిళలకు టికెట్ జారీ చేసిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ విచారణకు ఆదేశించారు. ఎండీ ఆదేశాలతో సంబంధిత కండక్టర్‌ను డిపో స్పేర్‌ లో ఉంచి పూర్తిస్థాయిలో ఆర్టీసీ అధికారులు విచారణ చేశారు.

నిజామాబాద్‌-బోధన్‌ రూట్‌ పల్లె వెలుగు బస్సులో నిజామాబాద్‌ టౌన్‌ బస్టాండ్‌ వద్ద ఆదివారం ముగ్గురు ఎక్కారు. అందులో ఒక ప్రయాణికుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆ ప్రయాణికుడు ముగ్గురికి బోధన్‌ టికెట్‌ ఇవ్వమని అడగడంతో రూ.30 చొప్పున ముగ్గురికి రూ.90 టికెట్‌‌ను కండక్టర్‌ జారీ చేశారు. నిజామాబాద్ టౌన్ దాటిన తర్వాత ఆ ప్రయాణికుడు కండక్టర్‌ వద్దకు వచ్చి మహిళలకు ఉచితం కదా.. టికెట్‌ ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. ముగ్గురు పురుషులే అనుకుని టికెట్‌ జారీ చేశానని కండక్టర్‌ సమాధానం ఇచ్చారు. వెంటనే ఆ టికెట్‌ వెనక్కి తీసుకుని పూర్తి డబ్బును తిరిగి ఇవ్వడం జరిగిందని విచారణలో తేలింది. ఈ విచారణలో కండక్టర్‌ ఉద్దేశపూర్వకంగా టికెట్‌ జారీ చేయలేదని తేలింది.

"రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రశాంతంగా అమలవుతోంది. ఈ సౌకర్యంపై క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ ఇప్పటికే అవగాహన కల్పించడం జరిగింది. క్షేత్ర స్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఈ పథకం సజావుగా అమలు అయ్యేందుకు ప్రజలందరూ సహకరించాలని సంస్థ కోరుతోంది." అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.

Updated Date - 2023-12-10T22:15:07+05:30 IST