Jupalli Krishnarao: ఎట్టకేలకు కాంగ్రెస్‌లోకి జూపల్లి కృష్ణారావు
ABN , First Publish Date - 2023-08-03T10:36:37+05:30 IST
ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్జే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు.
న్యూఢిల్లీ: ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former Minister Jupalli Krishna rao) కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjuna Kharge) సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే జూపల్లి సహా కూచుకుల్ల రాజేశ్ రెడ్డి, వనపర్తి నేత మెగారెడ్డి, మాజీ శాసనసభ్యులు గుర్నాథ్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttamkumar Reddy) , ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal), ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే (Incharge Manik Rao Thackeray), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasreddy), సంపత్ (Sampath) తదితరులు పాల్గొన్నారు.
కాగా.. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరిక పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అప్పుడూ అంటూ గత రెండు నెలల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది. చివరకు గత నెలలో మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి జూపల్లిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని పార్టీ వర్గాలు భావించాయి. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా వస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారం కూడా నిర్వహించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ సభ కూడా వాయిదా పడిపోయింది. దీంతో నిన్న (బుధవారం) జూపల్లి కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో జూపల్లి సహా మిగిలిన నేతలంతా మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ఉదయం నుంచి జూపల్లి కాంగ్రెస్‌లో చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. చివరకు అనివార్య కారణాల వల్ల జూపల్లి చేరిక వాయిదా పడినట్లు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది. అయితే నిన్న రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల అపాయింట్మెంట్ నేపథ్యంలో ఖర్గే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జూపల్లి చేరిక మరోసారి వాయిదా పడింది. చివరకు ఈరోజు ఉదయం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొల్లాపూర్‌లో త్వరలోనే భారీ బహిరంగ సభ పార్టీ వర్గాలు తెలియజేశాయి.