Share News

Khammam: ఈ ముగ్గురిలో ఎవరికి చోటు దక్కేనో.. కొత్త కేబినెట్‌పై చర్చోపచర్చలు

ABN , First Publish Date - 2023-12-05T10:02:08+05:30 IST

ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్‌.. ఏర్పాటు చేయబోతున్న

Khammam: ఈ ముగ్గురిలో ఎవరికి చోటు దక్కేనో.. కొత్త కేబినెట్‌పై చర్చోపచర్చలు

- తెరపైకి ముగ్గురి పేర్లు

- డిప్యూటీ సీఎంగా ప్రచారంలో భట్టి పేరు

- మంత్రులుగా తుమ్మల, పొంగులేటికి ఛాన్స్‌?

ఖమ్మం, (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్‌.. ఏర్పాటు చేయబోతున్న మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చోటు దక్కుతుందన్న దాని పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచే కాంగ్రెస్‌ గాలి వీచిందన్న ప్రచారం, ఒకేపార్టీ నుంచి దిగ్గజాలు బరిలో దిగి గెలవడంతో జిల్లాకు సముచిత ప్రాధాన్యం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఖమ్మంజిల్లాపైనే ఉంది. ఈ క్రమంలో మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Mallu Bhatti Vikramarka, Tummala Nageswara Rao, Ponguleti Srinivasa Reddy) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందని ప్రచారం జరుగుతుండగా.. ఖమ్మం నుంచి గెలిచిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రివర్గంలో చాన్స్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, అనుభవాలు, బలాబలాలు అన్నింటిని బేరీజు వేస్తున్న అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటోం దనన్న ఉత్కంఠ కనిపిస్తోంది. నాలుగోసారి మధిర నుంచి గెలిచిన భట్టి విక్రమార్క తాను నిర్వహించిన పీపుల్స్‌మార్చ్‌పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌కు బలం చేకూరిందని, అందువల్ల తనకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం వద్ద డిమాండ్‌ పెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి, స్వరాష్ట్ర మంత్రి వర్గాల్లో సుమారు 17ఏళ్లపైగా మంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌లో చేరి ఆరోసారి ఖమ్మం నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు పేరు ప్రచారంలో ఉంది.

దాంతోపాటు కాంగ్రెస్‌ నుంచి కమ్మ సామాజిక వర్గం తరపున గెలిచిన ఒకే ఒక్క నాయకుడు కావడం, ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించి.. కాంగ్రెస్‌ విజయానికి బాటలు వేయడం, మంత్రిగా ఆయనకున్న సుదీర్ఘ అనుభవం లాంటివి తుమ్మలకు కలిసొచ్చే అవకా శం కనిపి స్తోంది. పాలేరు నుంచి గెలిచిన పొంగులేటి పేరుకూడా మంత్రివర్గ జాబితాలో వినిపిస్తోంది. గతంలో ఖమ్మం ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఆయన కాంగ్రెస్‌లో చేరి.. పార్టీకి ఆర్థికంగా అండగా నిలిచారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పొంగులేటికి మంత్రి పదవి దక్కుంతుందని భావిస్తున్నారు. అయితే ఒకే జిల్లా నుంచి ముగ్గురు కీలక నేతలకు అవకాశం దక్కుతుందన్న వార్తల నేపథ్యంలో అధిష్ఠానం నిర్ణయంపై అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-12-05T10:02:10+05:30 IST