అనధికార లే అవుట్లపై కొరడా..!
ABN , First Publish Date - 2023-03-11T01:16:59+05:30 IST
శరవేగరంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగర శివార్లలో అనుమతి లేని భవనాలు, అక్రమ లే అవుట్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఫలితంగా ఓ వైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండగా.. మరో వైపు అమాయకుల కష్టార్జితం ఆవిరవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు కలెక్టర్ వీపీ గౌతమ్ సారథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

కలెక్టర్ గౌతమ్ చొరవతో పకడ్బందీగా చట్టం అమలు
ఖమ్మం జిల్లాలో 103ఎకరాల గ్రీనబెల్ట్ స్థలం
పంచాయతీలకు దక్కిన రూ.కోట్ల విలువైన స్థలాలు
ఖమ్మం కలెక్టరేట్, మార్చి 10: శరవేగరంగా అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగర శివార్లలో అనుమతి లేని భవనాలు, అక్రమ లే అవుట్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఫలితంగా ఓ వైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుండగా.. మరో వైపు అమాయకుల కష్టార్జితం ఆవిరవుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు కలెక్టర్ వీపీ గౌతమ్ సారథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అనధికార లే అవుట్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి వాటిని గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కదిలి క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. దీంతో జిల్లాలో అనధికార లే అవుట్లకు కాస్త బ్రేకులు పడ్డాయి. అంతే కాదు పాలకవర్గాలను న యానో భయానో బెదిరిస్తూ స్థిరాస్థి వ్యాపారులు తమ వ్యాపారాలను యథేచ్చగా కొనసాగించాలన్న ప్రయత్నాలను.. నిబంధనలను పకడ్బందీగా అమలు చేసి కట్టడి చేయగలిగారు. దీంతో పంచాయతీలు, నగరపాలకంలోనూ అధికంగా లే అవుట్లు క్రమబద్ధీకరణ కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం ఒనగూరడమే కాకుండా, పంచాయతీలకు గ్రీనబెల్ట్ స్థలాలు చేకూరుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 103ఎకరాల గ్రీనబెల్ట్ స్థలం లే అవుట్ల క్రమబద్ధీకరణతో సాధ్యమవగా.. ఈ స్థలాల విలువ రూ.కోటికి పైగానే ఉంటుందని భావిస్తున్నారు. వీటిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేసేలా పల్లె ప్రకృతి వనాలను పెంచి పంచాయతీల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. ఇక గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలుస్తున్నా.. రెండంతస్తులకు మించి భవనాలు నిర్మాణాలు జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శులు మిన్నకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని వెంచర్లు జోరుగా సాగాయి. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీపీ గౌతమ్ సుడా ఆధ్వర్యంలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018కి పదునుపెట్టారు. చట్టంలోని సెక్షన్ల ఆధారంగా అనేక నిబంధనలను అమలుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో జిల్లాలో అక్రమ వెంచర్లకు ఆస్కారం లేకుండా పోయింది. జిల్లాలో 48 గ్రామపంచాయతీలు సుడా పరిధిలోకి రావడంతో నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నారు.
భవనాల నిర్మాణానికి అనుమతులిలా..
గ్రామపంచాయతీ పరిధిలో నిబంధనలకు అనుగుణంగా భవనాల నిర్మాణానికి అనుమతినిస్తారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతి లభిస్తుంది.
300 చదరపు మీటర్ల స్థలంలో 10మీటర్ల ఎత్తులో భూతలంతో పాటు దానిపై రెండంతస్థుల భవనం నిర్మించేందుకు మాత్రమే అనుమతిస్తారు. ఈ భవన నిర్మాణం కోసం పెట్టుకున్న దరఖాస్తును పంచాయతీ కార్యదర్శి 24గంటల్లోపు పరిశీలిస్తారు.
ఒక వేళ గ్రామపంచాయతీకి దరఖాస్తు చేసుకుని 15రోజులు దాటినా ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే అనుమతి పొందినట్టు నిర్ధారిస్తారు.
భూతలంతో పాటు రెండతస్థులకు మించి మంజూరు చేసే అధికారం గ్రామపంచాయతీకి లేదు. ఇవన్నీ డీటీసీపీవో అనుమతిని జారీ చేయాల్సి ఉంటుంది. నివాస ప్రాంతాలకు గ్రామపంచాయతీలు అనుమతులు ఇచ్చినా కమర్షియల్ కాంప్లెక్సులకు మాత్రం డీటీసీపీవో నే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
భూ అభివృద్ధి, లే అవుట్ల తయారీకి నిబంధనలివీ..
ఎవరైనా యజమాని తన వ్యవసాయ భూమిని లే అవుట్ చేయదలిస్తే రాష్ట్ర వ్యవసాయ భూమి చట్టం (వ్యవసాయేతర అవసరాలు ) 2006 ప్రకారం మార్పిడి చేయాలి. దీనికోసం పంచాయతీకి దరఖాస్తు అందించాల్సి ఉంటుంది. పంచాయతీ అధికారులు ఆ దరఖాస్తును ఏడు రోజుల్లో సాంకేతిక అనుమతి కోసం టెక్నికల్ శాంక్షన (టీఎ్‌సఏ)కు పంపుతారు. ఒక వేళ పంచాయతీ వారు ఆ దరఖాస్తును ఏడు రోజుల్లోగా టీఎ్‌సఏకు పంపకుంటే అది టీఎ్‌సఏకు చేరినట్టుగా భావించాలి.
టెక్నికల్ శాంక్షన అఽథారిటీ (టీఎ్‌సఏ) తమ వద్దకు గ్రామపంచాయతీ నుంచి చేరిన దరఖాస్తును పరిశీలిస్తారు. 30రోజుల్లోగా భూ యజమానికి డెవలపర్‌కు లే అవుట్ సంబంధించిన అన్ని అంశాలను సూచిస్తారు.
టీఎ్‌సఏ సూచించిన అంశాలను డెవలపర్ పాటిస్తే లే అవుట్‌కు అనుమతులిస్తారు.
గ్రామపంచాయతీకి సొంతంగా లే అవుట్లకు అనుమతిచ్చే అధికారం లేదు.
అనుమతులు పొందిన లే అవుట్ రెండేళ్ల లోపు కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే ఇచ్చిన అనుమతులు చెల్లవు.
లే అవుట్ చేసిన వారు అమ్మకం కోసం పెట్టిన భూమిలో 15శాతం స్థలాన్ని విధిగా గ్రామపంచాయతీకి తనఖా చేయాల్సి ఉంటుంది. ఆ భూమిని గ్రామపంచాయతీ స్వాధీనంలో ఉంచుకుని గ్రామ అవసరాలకు వినియోగిస్తారు.
జిల్లాలో స్తంభాద్రి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ (సుడా) పరిధిలో ఉన్న ప్రస్తుతం 48పంచాయతీల్లో అనుమతులు సుడానే ఇస్తోంది. వాస్తవానికి గ్రామపంచాయతీల్లో 2.50 ఎకరాల లోపు అనుమతులకు ఖమ్మంలో డీటీసీపీవో, 5 ఎకరాల స్థలానికి వరంగల్ నుంచి, 5 ఎకరాలు దాటిన వాటికి హైదరాబాద్ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ సుడా పరిధిలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ వీపీ గౌతమ్ సాఽరధ్యంలో సుడా వీటిని పర్యవేక్షిస్తోంది.
జిల్లాలో 103 ఎకరాల గ్రీనబెల్ట్ స్థలం
వింజం వెంకట అప్పారావు,
ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి, జడ్పీ సీఈవో
ఖమ్మం జిల్లాలో అక్రమ లే అవుట్లపై కొరఢా విధించడంతో 111 పంచాయతీల్లో కనీసం 103.14 ఎకరాల స్థలం ఆయా పంచాయతీలకు దక్కింది. లే అవుట్లు చేసిన వెంచర్ల వ్యాపారులు ఆయా పంచాయతీలకు 15శాతం గ్రీనబెల్ట్ స్థలాన్ని మార్టిగేజ్ చేశారు. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. రెండేళ్లలో ఇలాంటి అక్రమ వెంచర్లపై దృష్టిసారించడంతో జిల్లాలో పంచాయతీలకు ఆదాయం రావడంతో పాటు విలువైన స్థలాలకు కూడా దక్కినట్లైంది. కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రత్యేక దృష్టి పెట్టడం, పంచాయతీ సిబ్బంది చొరవతో ఇది సాధ్యమైంది.