TS Election: నగదు పంపిణీకి సిబ్బంది నియామకం! ఓ జాతీయ పార్టీ ఎత్తుగడ!
ABN , First Publish Date - 2023-10-02T03:56:43+05:30 IST
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల పండగ ముందే మొదలైంది. నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఓటర్లకు తొలి విడత తాయిలాల పంపిణీ షురూ అయింది.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఆధ్వర్యంలో కానుకలు
నియోజకవర్గమంతా పంచాలని ప్రణాళిక
దుబ్బాక, అక్టోబరు 1: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల పండగ ముందే మొదలైంది. నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఓటర్లకు తొలి విడత తాయిలాల పంపిణీ షురూ అయింది. ఇప్పటికే ఒక జాతీయ పార్టీ.. మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులకు కారు, నెల జీతంగా రూ.50 వేలు అందిస్తోంది. అలిగిన సర్పంచులకు కార్లను ఇచ్చింది. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలోఇంటింటికీ గొడుగు, మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్నారు. ఆదివారం దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో వీటిని అందించారు. మహిళలకు చీర, గొడుగు, కమలం గుర్తును పంపిణీ చేశారు. పురుషులకు గొడుగులు ఇచ్చా రు. వీటిపై ఎమ్మెల్యే రఘునందన్ ఫొటోను ముద్రించారు. నియోజకవర్గంలోని తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగ్ మండలాలకు కానుకలను సరఫరా చేశారు. నియోజకవర్గంలో సుమారు 1,92,293 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ప్రతి మహిళా ఓటరుకు(97,637 మందికి) చీరలను, మొత్తం ఓటర్లకు గొడుగులను పంపిణీకి చర్యలు చేపట్టారు. సుమారు రూ.వెయ్యి విలువైన చీరలను అందిస్తున్నారు. సిద్దిపేటలోని వెలమ సామాజిక వర్గానికి చెందిన ఫంక్షన్ హాల్ కేంద్రంగా దుబ్బాక నియోజకవర్గానికి వీటిని సరఫరా చేస్తున్నారు. .
ఇంటికి రూ.10 వేలు ఇచ్చేద్దాం..!
దుబ్బాకలో ఓటుకు రూ.రెండు వేల చొప్పున పంపిణీ చేసేందుకు ఓ జాతీయ పార్టీ సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే ప్రతి 200 ఓట్లకు ఒక కీ-ఓటర్‌ను నియమించారు. ఆ ఓటరు పరిధిలోని ఇళ్లను గుర్తించి, నెలకు రూ.పది వేల చొప్పున అందించనున్నట్లు తెలిసింది. 5 ఓట్ల కంటే ఎక్కువగా ఉన్న ఇళ్లను గుర్తించి, వారికి ఓటుకు రూ.2వేలు, ఇతర నజరానాలను అందించేందుకు రూపకల్పన చేసినట్టు తెలిసింది.