విషాదం నింపిన హోలీ
ABN , First Publish Date - 2023-03-10T00:42:24+05:30 IST
: హోలీ సంబరాలు ఓ ఇంట్లో విషాదం నింపాయి. ఈత కోసం బావికి వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈతకు వెళ్లి యువకుడి మృతి ఫ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఘటన
భూదాన్‌పోచంపల్లి, మార్చి 9: హోలీ సంబరాలు ఓ ఇంట్లో విషాదం నింపాయి. ఈత కోసం బావికి వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూదాన్‌పోచంపల్లి తొమ్మిదో వార్డుకు చెందిన ఒంటెద్దు నర్సింహ, పద్మకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు స్వామి (25) ఉన్నారు. స్వామి స్థానిక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 7వ తేదీన హోలీ వేడుకల్లో పాల్గొని, స్నేహితులతో కలిసి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్నానం చేయడానికి స్థానికంగా ఉన్న బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ఈత కొట్టిన స్నేహితులు, స్వామిని గమనించకుండా ఇంటికి వెళ్లి పోయారు. స్నానం కోసం బావిలోకి దూకిన స్వామి బావిలో ఉన్న బురదలో కూరుకుపోయాడు. దీంతో అతడు బయటకు రాలేక అందులోనే ఇరుక్కుని మృతిచెందాడు.
స్నానానికి వెళ్లిన కుమారుడు రాకపోవడంతో..
స్నానం కోసం వెళ్లిన తన కుమారుడు ఇంటికి రాకపోవడంతో స్వామి తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. స్వామి స్నేహితులతోపాటు గ్రామస్థులందరి వద్ద ఆచూకీ కోసం వాకబు చేశారు. ఎవరి నుంచి తెలియదనే సమాధానం రావడంతో ఆందోళన చెందారు. అయితే బుధవారం రాత్రి అదే కాలనీకి చెందిన ఒంటెద్దు కిష్టయ్య బావి వైపు వెళ్లడంతో చెప్పులు, దుస్తులు కనిపించాయి. వెంటనే స్వామి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, అవి తమ కుమారుడివిగా గుర్తించారు. రాత్రి 10 గంటల సమయంలో బావిలో స్వామిని వెతకడం ప్రారంభించారు. చౌటుప్పల్ సీఐ మహేష్, స్థానిక ఎస్‌ఐ సైదిరెడ్డి, వార్డు కౌన్సిలర్ సామల మల్లారెడ్డి ఆధ్వర్యంలో బావిలో ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడించారు. సంఘటనా స్థలానికి చౌటుప్పల్ ఫైర్ సిబ్బంది కూడా చేరుకుని స్వామి మృతదేహంకోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం బావిలోని నీరు పూర్తిగా తగ్గడంతో బురదలో కూరుకుపోయిన స్వామి మృతదేహం కనిపించింది. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించా రు. స్వామి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.