Cyclone Michaung: అలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
ABN , First Publish Date - 2023-12-05T18:37:51+05:30 IST
మిచౌంగ్ తుఫాను తీరం దాటి ముంచుకొస్తున్న తరుణంలో.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Telangana Heavy Rains: మిచౌంగ్ తుఫాను తీరం దాటి ముంచుకొస్తున్న తరుణంలో.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా.. మంగళ, బుధవారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే వీలుందని.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రెండు జిల్లాలకు ఒక్కోటి చొప్పున ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపాలని పేర్కొంది. ‘‘మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపిస్తున్నాం. ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. నీటిపారుదల, విపత్తు నిర్వహణ, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను అప్రమత్తం చేయాలని సూచించారు.
ఇదే సమయంలో సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో మిచౌంగ్ తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో.. అధికారులు వెంటనే అలర్ట్ అవ్వాలన్నారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని.. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.