కల్లలైన కలలు
ABN , First Publish Date - 2023-03-18T00:02:03+05:30 IST
వాళ్లు ఎన్నో ఆశలతో ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టారు.. అక్కడే ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవితంలో ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు.. కన్నవారికి ఆర్థికంగా చేదోడువాదోడుగా ఉంటున్నారు.. కానీ విధి వింత నాటకం ఆడింది. అగ్రిప్రమాదం రూపంలో వారిని కబళించింది. సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్సులో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెను విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందగా, వారిలో ఐదుగురు ఓరుగల్లు వాసులే కావడం గుండెల్ని పిండేసింది.

సికింద్రాబాద్ అగ్నిప్రమాదం మృతుల్లో ఐదుగురు ఉమ్మడి జిల్లా వాసులు
మృతుల్లో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు
బీటెక్ పూర్తిచేసి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు
విధి నిర్వహణలో ఉండగానే చుట్టుముట్టిన పొగ
కార్యాలయ గదుల్లో ఊపిరాడక కన్నుమూత
స్వస్థలాలకు చేరుకున్న మృతదేహాలు
బాధిత కుటుంబాల్లో మిన్నంటిన రోదనలు
మంత్రి సత్యవతి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్‌ల దిగ్ర్భాంతి
మృతులు వీరే...
ఉప్పుల శివ(23), చంద్రయ్యపల్లె, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లా- ఈ కామర్స్ ఆన్‌లైన్ ఉద్యోగం.
బానోతు శ్రావణి (22), టేకులతండా, ఖానాపురం మండలం, వరంగల్ జిల్లా - మల్టీలెవల్ కంపెనీ కాల్‌సెంటర్‌లో ఉద్యోగం.
వంగ వెన్నెల (22), మర్రిపల్లి, దుగ్గొండి మండలం- కాల్ సెంటర్‌లో ఉద్యోగం.
అమరాజు ప్రశాంత్(23), ఇంటికన్నె , కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా - ఈ కామర్స్ కోర్సులో స్టూడెంట్.
జాటోత్ ప్రమీల(23), సురే్‌షనగర్, గూడూరు మండలం, మహబూబాబాద్ జిల్లా - ఈ కామర్స్ కోర్సులో స్టూడెంట్
కేసముద్రం/మహబూబాబాద్/వరంగల్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్ర మాదం ఘటనలో వరంగల్, మహబూబాబాద్ జిల్లా లకు చెందిన ఐదుగురు మృతి చెందడం తీవ్ర విషా దాన్ని మిగిల్చింది. ఉపాధి కోసం వెళ్లిన తమ పిల్లలు విగతజీవులుగా తిరిగిరావడంతో ఆయా కుటుంబాటు కన్నీటి కడలిలో మునిగిపోయాయి. అగ్నిప్రమాదంలో వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు ప్రాణాలొదిలా రు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెకు చెందిన ఉప్పుల శివ(23, ఖానాపురం శివారు టేకులతండాకు చెందిన బానోతు శ్రావణి (22), దుగ్గొండి మండలంలోని మర్రిపల్లికి చెందిన వంగ వెన్నెల (22)లు మృత్యువాతపడ్డారు.
తాపీమేస్ర్తీ కొడుకు..
నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెకు చెందిన ఉప్పుల రాజు-రజిత దంపతులకు కుమారుడు శివ (23), కూతురు ఉన్నారు. రాజు వ్యవసాయంతో పాటు తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శివ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ గత రెండేళ్ల కిందట బీటెక్ పూర్తి చేశారు. అనంతరం సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఇ-కామర్స్ ‘ఆన్‌లైన్’ ఉద్యోగం చేస్తున్న ట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం సా యంత్రం ఫోన్‌లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నట్లు కుటుంబసభ్యులు శుక్రవారం చెప్పారు. తెల్లవారగానే అగ్నిప్రమాద సంఘటనలో ఊపిరిపాడక శివ మృతి చెందడాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నామని కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, శివ మృతదేహాన్ని రాత్రి చంద్రయ్యపల్లెకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
కుమార్తెతో పాటు..
వరంగల్ జిల్లా ఖానాపురం శివారు టేకులతండాకు చెందిన బానోతు శ్రావణి (22) అనే గిరిజన యువతి మృతి అగ్నిప్రమాదంలో చెందింది. నిరుపేద కుటుంబానికి చెందిన బానోతు నర్సిమ్మ-పద్మ అలియాస్ రాంబాయిలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రావణి నల్లగొండ జిల్లా కోదాడలో బీటెక్ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లింది. ఆరు నెలల నుంచి సికింద్రాబాద్‌లోని ఓ మల్టీలెవల్ కంపెనీ కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఖానాపురంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న నర్సింహా దంపతులు కుమార్తె హైదరాబాద్‌లో ఉండటంతో జీవనోపాధి కోసం ఏడాది కిందట హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటూ హోటల్‌లో పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. చిన్న కుమార్తె స్రవంతి సిరిసిల్లలో డిగ్రీ చదువుతుండగా, కుమారుడు రాజేశ్ హనుమకొండలో ఐటీఐ చదువుతున్నాడు. ఈ క్రమంలో అగ్నిప్రమాదంలో శ్రావణి మృతి చెందడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. శ్రావణి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామమైన ఖానాపురం శివారులోని టేకులతండాకు శుక్రవారం రాత్రి తీసువచ్చారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, తదితర నేతలు సందర్శించారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.
మర్రిపల్లిలో..
దుగ్గొండి మండలంలోని మర్రిపల్లికి చెందిన వంగ వెన్నెల (22) మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ రవి-లక్ష్మీలు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పొషించుకుంటున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. వెన్నెల డిగ్రీ వరకు చదివింది. ప్రైవేట్ కంపెనీ ఈ-కామర్స్ సంస్థలో ఉద్యోగం చేసుకోవడానికి రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు వెళ్లింది. అందులో భాగంగా సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో కాల్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. కాంప్లెక్స్‌లో అగ్ని మంటలు లేచి ఊపిరి ఆడక పోవడంతో మృతి చెందింది. ఉద్యోగం చేయడానికి వెళ్లిన కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. కాగా, వెన్నెల మృతదేహం సాయంత్రం మర్రిపల్లికి చేరుకుంది. రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు..
అగ్ని ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమరాజు ప్రశాంత్(23), గూడూరు మండలం ఎర్రకుంటతండా జీపీ పరిధిలోని సురే్‌షనగర్‌కు చెందిన జాటోత్ ప్రమీల(23) స్వప్నలోక్ అగ్నిప్రమాదంలో మృత్యువాత పడ్డారు.
ఏకైక కుమారుడు ప్రశాంత్
ఇంటికన్నె గ్రామానికి చెందిన కూలి పనిచేసుకుని జీవించే అమరాజు జనార్దన్ - ఉపేంద్ర దంపతులకు కూతురు నిరోషా, కుమారుడు ప్రశాంత్ సంతానం. రెండేళ్ల కిందట డిగ్రీ పూర్తిచేసిన ప్రశాంత్.. ఆర్మీ దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యాడు. ఆర్మీ ఈవెంట్స్ పోటీల్లో కీలకమైన రన్నింగ్‌లో టాప్‌టెన్ ర్యాంకు సాధించాడు. అయితే ఆర్మీ పరీక్షలు రద్దుకావడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయుంది. అనంతరం పోలీసు కొలువు సాధించాలని సాధన చేస్తూ గ్రామంలోని హైస్కూల్ మైదానంలో పలువురు యువకులకు శిక్షణనిచ్చేవాడు. ఈ క్రమంలో ఈ-కామర్స్ కోర్సు అంటూ రూ.2.60 లక్షలు చెల్లించి హైదరాబాద్‌లో చేరాడు. ఇందులో శిక్షణ పూర్తయిన తర్వాత సంస్థ వారే ఉపాధి కల్పిస్తారని చెప్పడంతో నిరుపేద కుటుంబం అయినప్పటికీ ప్రశాంత్ తల్లిదండ్రులు అప్పు చేసి డబ్బు చెల్లించి కొడుకును పంపించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌కు సమీపంలో గది అద్దెకు తీసుకొని ప్రశాంత్‌తోపాటు ఇదే ప్రమాదంలో మరో మృతుడైన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన యు.శివ కలిసి ఉంటున్నారు. వీరు శిక్షణ పొందుతున్న సంస్థ కార్యాలయం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తుండడంతో ప్రశాంత్ ఈ ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందాడు. కాగా, ప్రశాంత్ మృతదేహం శుక్రవారం రాత్రి ఇంటికన్నెకు చేరుకుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత అంత్యక్రి యలు నిర్వహించారు.
ఒక్కగానొక్క కుమార్తె ప్రమీల..
గూడూరు మండలం ఎర్రకుంటతండా శివారు సురే్‌షనగర్‌కు చెందిన వ్యవసాయ కూలీలైన జాటోత్ భద్రు - బుజ్జి దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె ప్రమీల. నర్సంపేటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌లో 985 మార్కులు సాధించిన ప్రమీల.. కోదాడలోని ప్రైవేట్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి చదువులో అత్యంత ప్రతిభ కలిగిన ప్రమీల.. ఈ-కామర్స్‌లో శిక్షణతోపాటు ఉద్యోగం కోసమని రూ.2.60లక్షలు చెల్లించింది. నిరుపేద కుటుం బం కావడంతో ప్రమీల తల్లిదండ్రులు ఈ డబ్బులను అప్పులు తీసుకునివచ్చి చెల్లించారు. ఆమె సికింద్రాబా ద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని సంస్థ కార్యాలయంలో ఉన్న సమయంలో ప్రమాదం జరిగి మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మంచి ఉద్యోగంలో చేరి ఉన్నతంగా జీవిస్తుందని భావించిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. కాగా, ప్రమీల మృతదేహం శుక్రవారం రాత్రి సురే్‌షనగర్‌కు చేరుకుంది. శనివా రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.
మంత్రి సత్యవతి సంతాపం
స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందడంపట్ల రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని, ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధకరమని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మానుకోట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అగ్నిప్రమాదంలో మృతి చెందడంతో ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా అదుకునేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.