ఇంకెప్పుడు!
ABN , First Publish Date - 2023-04-21T23:24:55+05:30 IST
జిల్లాలో నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తోంది. 12 మండలాల్లో కొత్తగా 91 జీపీలను ప్రకటించి నాలుగేళ్లవుతున్నా ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదు. ఆ పనులను ప్రస్తుతం పాత ఎఫ్‌ఏలు, కార్యదర్శులే చూస్తున్నారు. కాని అదనపు భారంతో వారు ఇబ్బందిపడుతున్నారు. అంతేగాకుండా సరైన నిర్వహణ లేక ఉపాధి పనులు గాడి తప్పుతున్నాయి. అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నూతన జీపీల్లో ఎఫ్‌ఏలను నియమించాలని ప్రస్తుత సిబ్బంది కోరుతున్నారు.

ఎఫ్‌ఏల నియామకంలో సర్కారు తాత్సారం
నూతన పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు లేక ఇబ్బందులు
పాతవారిపైనే అదనపు భారం
కొరవడుతున్న పర్యవేక్షణ
గాడి తప్పుతున్న ఉపాధి పనులు
91 పంచాయతీల్లో ఖాళీగా ఉన్న పోస్టులు
జఫర్‌గడ్, ఏప్రిల్ 21: జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఇప్పటివరకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదు. దీంతో పాత గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ కార్యదర్శులే ఉపా ధి పనుల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తత్ఫలితంగా వారి పై అదనపు భారం తప్పడం లేదు. అంతేగాకుండా ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు గాడితప్పుతున్నాయి. పనులు చేయించడం, సంబంధిత ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో, రికార్డు ల్లో నమోదు చేయ డం ఫీల్డ్ అసిస్టెంట్ల పని. అయితే నాలుగేళ్లు దాటినా ఎఫ్‌ఏల నియా మకం చేపట్టకపోవడంతో ఆ పను లు సక్రమంగా సాగడం లేదు. అం తేగాకుండా కూలీ ల సంఖ్య పెరగ కపోవడం, సకా లంలో పనులు పూర్తి కాకపోవ డం, కూలీలకు డబ్బులు జమ కాకపోవడం వంటి సమస్యలు తలె త్తుతున్నాయి.
91 పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత...
తెలంగాణ ప్రభుత్వం 2019లో తండాలు, గూడెంలు, ఆవాస ప్రాంతాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అయితే ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించలేదు. సుమారు నాలుగేళ్లుగా పాత పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, మేట్లు ఆయా పంచాయతీల్లో ఉపాధి పనులను పర్యవేక్షిస్తున్నారు. జనగామ జిల్లాలో ప్రస్తుతం 281 గ్రామ పంచాయతీలు ఉండగా కొత్తవి 91 ఉన్నాయి. వీటిల్లో ఇప్పటి వరకు ఎఫ్‌ఏల నియామకం జరగలేదు. అదేవిధంగా వివిధ కారణాలతో తొలగించిన వారిస్థానంలో కూడా ఎఫ్‌ఏలను నయమించాల్సి ఉంది. వెరసి ఈ భారమంతా పాత వారిపైనే పడుతోంది. దీంతో వారు కూలీలకు సక్రమంగా పనులు కల్పించలేకపోతున్నారు.
పాత జీపీల ఎఫ్‌ఏలతోనే పనులు..
- శ్రీధర్‌స్వామి, ఎంపీడీవో, జఫర్‌గడ్
మండలంలో ఏర్పడిన నాలుగు కొత్త జీపీలతో పాటు గతంలో వివిధ కారణాలతో తొలగించిన ఉప్పుగల్లు, తమ్మడపల్లి(ఐ) గ్రామాలకు ఫీల్డ్ అసిస్టెంట్లు లేరు. ఆయా గ్రామాల్లో పాత జీపీల ఎఫ్‌ఏలు, మేట్ల సహాయంతో ఉపాధి పనులు చేపడుతున్నాం. కొత్త పంచాయతీల్లో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకం ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. అయినప్పటికీ మండలంలో ఉపాధి పనులకు ఆటంకం కలగకుండా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నాం.
కొత్త జీపీల్లో ఎఫ్‌ఏలను నియమించాలి..
- రాపర్తి రాజు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి ఉపాధి పనులు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి పథకం గ్రామీణ కూలీల జీవనోపాధికి ఎంతగానో దోహదపడుతోంది. ఉపాధి పనులను చేపట్డడం, కూలీలచే పనులు చేయించి, వారి ఖాతాల్లో సకాలంలో కూలీ డబ్బులు జమయ్యేలా చూడడం, జాబ్ కార్డులు అందివ్వడం, అధికారులు - కూలీల మధ్య సంధానకర్తగా వ్యవహరించడం, పని చోట సౌకర్యాలు కల్పించడం వంటి పనులు ఎఫ్‌ఏలు చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా సర్కారు నిర్లక్ష్యం వీడి ఎఫ్‌ఏలను వెంటనే నియమించాలి.
ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..
- గూడూరు రాంరెడ్డి, డీఆర్‌డీవో
కొత్త పంచాయతీల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఏల నియామకం జరకపోవడంతో పాత పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, పంచాయతీ కార్యదర్శులు పనులను పర్యవేక్షిస్తున్నారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. కొత్త పంచాయతీల్లో ఎఫ్‌ఏలను ప్రభుత్వం నియమించాల్సి ఉంది. అప్పటి వరకు పనులు సక్రమంగా జరిగేలా, కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కార్యదర్శులు విధుల్లో భాగంగా ఉపాధి పనులను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది.