వన్యప్రాణాలు..!
ABN , First Publish Date - 2023-04-14T23:49:43+05:30 IST
వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వేసవిలో దప్పిక తీర్చేందుకు అడవుల్లో నీటి గుంతలు, చెక్ డ్యామ్‌లు, సాసర్‌లు అవసరాన్ని బట్టి సోలార్ బోర్లను ఏర్పాటు చేసింది.

అడవిలో నీటి వసతుల కల్పనపై అటవీశాఖ దృష్టి
నీటి గుంతలు, చెక్ డ్యామ్‌లు, సాసర్‌లు, సోలార్ బోర్లు ఏర్పాటు
వేసవిలో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు శాశ్వత నిర్మాణాలు
నీరు లభ్యమయ్యే ప్రాంతాల్లోకి జంతువుల రాక
వేటగాళ్ల కోసం అడవిలో సీసీ కెమెరాలు.. బెస్ క్యాంపులు
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో జంతువుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ
భూపాలపల్లి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వేసవిలో దప్పిక తీర్చేందుకు అడవుల్లో నీటి గుంతలు, చెక్ డ్యామ్‌లు, సాసర్‌లు అవసరాన్ని బట్టి సోలార్ బోర్లను ఏర్పాటు చేసింది. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు దాహర్తిని తీర్చుకునేందుకు వచ్చే జంతువులు వేటగాళ్లకు చిక్కకుండా సీసీ కెమెరాలు, బెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అడవుల జిల్లాలుగా పేరున్న ములుగు, భూపాలపల్లి జిల్లాలో వన్యప్రా ణులను కాపాడేందుకు అధికారులు కాంపా నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
వేసవి దప్పికతో విలవిల..
మండుతున్న ఎండలతో అడవుల్లో ఆకులు రాలిపోతున్నాయి. వాగులు, వంకలు, గుంటల్లో నీళ్లులేక పగుళ్లు పారుతుంటాయి. దీంతో అటవీ ప్రాంతం లో గొంతు తడుపుకునేందుకు నీటిచుక్క కూడా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణుల దప్పికతో విలవిలలాడుతుంటాయి. దుప్పులు, అడవి పందులు, కృష్ణజింకలు, అడవిదున్న, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, కుందేళ్లు తదితర అడవి జంతువులు నీళ్ల కోసం వేసవిలో దాహర్తితో అల్లాడుతుంటాయి. అడవి జంతువులు నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వస్తున్నాయి.
వేటగాళ్ల దృష్టిలో పడితే ఇక వన్యప్రాణులు గాలి లో కలిపి పోవాల్సింది. ఇప్పటికే భూపాలపల్లి జిల్లా పలిమెల, మహాముత్తారం, ఆజాంనగర్, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, తాడ్వాయి మండలాల్లోని అడవుల్లో అడవి జంతువులు వేటగాళ్లకు ఆహారంగా మారుతున్నాయి. నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు వచ్చే జంతువులపై వేటగాళ్లు గురి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వన్యప్రాణులను కాపాడుకునేందుకు ప్రభుత్వం అడవుల్లోనే నీటి వసతులను కల్పించేందుకు కాంపా పథకం ద్వారా నిధులు కేటాయిస్తోంది.
అడవుల్లో నీటి గుంతలు..
వన్యప్రాణులను వేసవి దప్పిక నుంచి కాపాడేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. 2016 నుంచి భూపాలపల్లి, ములుగు జిల్లాలో సుమారు రూ.30 కోట్ల కాంపా నిధులతో అటవీశాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భూపాలపల్లి జిల్లా అటవీశాఖ పరిధిలో 52 నీటి గుంతలు, 119 మినీ పీటీ (పెర్కోలేషన్ ట్యాంకు)లు, 65 పెర్కోలేషన్ ట్యాంకులు, 134 చెక్‌డ్యాంలు, 102 సాసర్‌పిట్స్, 9 సోలార్ బోర్లు, 151 రాక్‌ఫిల్ డ్యాంలు, 28 చెలిమెలు తదితర నీటి వసతులను ఏర్పాటు చేశారు.
ములుగు జిల్లాలో 100కు పైగా నీటిగుంతలు, 55 సిమెంట్ నీటి తొట్టెలు,. 660 చిన్నరాతి కట్టడాలు, 50 పెర్కులేషన్ ట్యాంకులు, 6 సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటు చేశారు. అడవిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని నిర్మించారు. వీటిలో ట్రాక్టర్లు, మిని వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని నింపుతున్నారు. గ్రామాలకు దూరంగా ఉన్న వాజేడు, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, పలిమెల, మహాముత్తారం అడవుల్లో సోలార్ ఆధారిత బోర్లు ఏర్పాటు చేశారు. ఈ బోర్లతో చుట్టుపక్కల చెక్ డ్యామ్‌లు, నీటి గుంతలు, నీటితొట్టే (సాసర్)లతో నీటిని నింపుతున్నారు. వారానికి ఒకటి రెండు సార్లు తప్పకుండా నీటిని నింపేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని ఓ అటవీశాఖ అధికారి తెలిపారు. వన్యప్రాణులకు అడవిలో నీటిని అందించటంతో నీటి జాడలు వెతుక్కుంటూ గ్రామాల్లోకి వచ్చే అవకాశం తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. పైగా నీటి లభ్యత ఉండే ప్రాంతాల్లో గడ్డి కూడా మొలిచే అవకాశం ఉంటుందని, ఈ గడ్డి జంతువులకు ఆహారంగా ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. అలాగే వన్యప్రాణులు ఆకలి, దప్పిక కోసం ఎంచుకున్న ప్రదేశాల్లో కృత్రిమంగా నీరునిల్వ ఉండేలా చెక్‌డ్యాంలు నిర్మించారు. నీటి వనరులు లేని చోటబోర్లు వేసి సోలార్‌తో నడిచే మోటర్లను బిగిస్తున్నారు. తద్వారా వన్యప్రాణుల కోసం నీరు, గడ్డి కొరత తీర్చగలుగుతున్నారు.
వేటగాళ్లకు పండుగే..
వేసవి వచ్చిందంటే వేటగాళ్లకు పండుగే. వేసవిలో నీటి లభ్యత ఉండే ప్రాంతాలపై వేటగాళ్లు దృష్టి సారిస్తారు. గోదావరి తీరంతో పాటు అడవుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వేటగాళ్లు ఉచ్చులు, వలలు వేయటంతో పాటు బాణాలు, నాటు తుపాకీలు, మందుగుండు సామగ్రితో జంతువులపై దాడికి వ్యూహలు అమలు చేస్తుంటారు. అడవిశాఖ అధికారులు వన్యప్రాణుల కోసం అడవిలో ఏర్పాటు చేసే నీటి గుంటలు, చెక్ డ్యామ్‌లు, సాసర్‌లు, సోలార్ బోర్ల సమీపంలోను వేటగాళ్లు దాడులకు పాల్పడుతుంటారు. దీనికి చెక్‌పెట్టి వన్యప్రాణులను కాపాడేందుకు అటవీశాఖ అధికారులు అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
పలిమెల, మహదేవపూర్, మహముత్తారం, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వాజేడు అడవి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశా రు. వీటితో పాటు ఏటూరునాగారం అభయారణ్యం, పలిమెల, మహముత్తారం అడవుల్లో బెస్ క్యాంపులతో పాటు రాత్రి వేళల్లో ప్లాయింగ్ స్క్వాడ్‌లు తిరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇటీవల కాలంలో ములుగు, భూపాలపల్లి జిల్లాలో పలుచోట్ల అడవి జంతువులను వేటాడిన వారిని అడవిశాఖ అధికారులు పట్టుకున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ వన్యప్రాణులకు రక్షణ కవచంగా మారిందనే టాక్ వినబడుతోంది...