Share News

Gannavaram Airport: ‘విమానానికి’ వీడనున్న చెర!

ABN , Publish Date - Jun 16 , 2024 | 05:53 AM

రాష్ట్ర పోలీసుల చెర నుంచి విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి విముక్తి కలగబోతోంది. త్వరలో ఈ విమానాశ్రయం కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లబోతోంది. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలోని ఎస్పీఎఫ్‌, ఏపీఎస్పీ, ఆక్టోపస్‌ సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.

Gannavaram Airport: ‘విమానానికి’ వీడనున్న చెర!

  • బెజవాడ విమానాశ్రయంలో ఇక సీఐఎ్‌సఎఫ్‌ భద్రత

  • ఇప్పటి వరకు రాష్ట్ర పోలీసులతోనే నిర్వహణ

  • తాడేపల్లి ప్యాలెస్‌ కనుసన్నల్లో అక్రమాల ఆరోపణలు

  • జూలై 2న రానున్న 250 మంది సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది

  • రాష్ట్ర బలగాలను ఉపసంహరించుకోవాలని డీజీపీకి లేఖ

  • సిబ్బంది క్వార్టర్స్‌నూ ఖాళీ చేయాలని ఏఏఐ స్పష్టీకరణ

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

రాష్ట్ర పోలీసుల చెర నుంచి విజయవాడ(గన్నవరం) విమానాశ్రయానికి విముక్తి కలగబోతోంది. త్వరలో ఈ విమానాశ్రయం కేంద్ర బలగాల ఆధీనంలోకి వెళ్లబోతోంది. ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలోని ఎస్పీఎఫ్‌, ఏపీఎస్పీ, ఆక్టోపస్‌ సిబ్బంది భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ బలగాలను ఉపసంహరించుకోవాలని విమానాశ్రయ డైరెక్టర్‌ లక్ష్మీకాంత్‌రెడ్డి డీజీపీకి లేఖ రాశారు. ఈ బలగాల స్థానంలో సీఐఎ్‌సఎఫ్‌ బలగాలను భద్రతకు నియమిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయ సిబ్బందికి సంబంధించిన క్వార్టర్స్‌లో రాష్ట్ర పోలీసులు ఉంటున్నారని, వాటిని తక్షణమే ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ విమానాశ్రయ భద్రతను రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. 2019 నుంచి ఈ విమానాశ్రయం ద్వారా జగన్‌ అండ్‌ కో అనేక వ్యవహారాలను చక్కబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖుల ముసుగులో భారీగా బ్యాగ్‌లను తీసుకురావడం, తీసుకెళ్లడం చేసేవారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలె్‌సలో పనిచేసిన అధికారుల కనుసన్నల్లో బంగారం విమానాశ్రయం ద్వారాలు దాటి వచ్చిందన్నది బహిరంగ రహస్యం. ఈ వ్యవహారాలు సజావుగా సాగాలంటే రాష్ట్ర పోలీసుల భద్రత అయితేనే మంచిదన్న భావనతో ఇక్కడ ఎస్పీఎఫ్‌, ఏపీఎస్పీ, ఆక్టోపస్‌ బలగాలను నియమించినట్టు ఆరోపణలున్నాయి. ఆగమన, నిష్క్రమణ ద్వారాల వద్ద, రన్‌వేల దగ్గర, కార్గో పాయింట్ల వద్ద వారు భద్రతను నిర్వర్తిస్తున్నారు.


ఎంవోయూను అడ్డుపెట్టుకుని..

విజయవాడ విమానాశ్రయంలో సీఐఎ్‌సఎఫ్‌ భద్రత ఏర్పాటు చేయాలని 2017లోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భావించింది. అయితే, 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తొక్కిపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా జరిగిన ఎంవోయూను సాకుగా చూపి సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు రాకుండా కుట్రలు పన్నింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2007లో గన్నవరం కేంద్రంగా విజయవాడ విమానాశ్రయ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పుడు విమాన ప్రయాణాలకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉండేది. సేవలు అప్పుడప్పుడే ప్రారంభమవ్వడంతో ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. విమానాశ్రయం అభివృద్ధి చెందే వరకు రాష్ట్ర పోలీసు విభాగంతోనే భద్రత కల్పించాలన్నది అందులోని సారాంశం. దీన్ని అదునుగా చేసుకుని మాజీ సీఎం జగన్‌ సొంత ప్రణాళికలను అమలు చేశారు. విజయవాడ విమానాశ్రయం దశలవారీగా అభివృద్ధి చెందినా జగన్‌ అండ్‌ కో వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా జరగాలంటే రాష్ట్ర పోలీసులు ఉంటేనే మంచిదని భావించారు. ఎస్పీఎఫ్‌, ఏపీఎస్పీ, ఆక్టోపస్‌, స్థానిక పోలీసులతో మొత్తం 273 మందిని భద్రతకు ఏర్పాటు చేశారు. విమానాశ్రయ సిబ్బంది కోసం నిర్మించిన క్వార్టర్స్‌లో వారికి నివాసం ఏర్పాటు చేశారు.


  • అంతర్జాతీయ సర్వీసుల ప్రారంభంతో..

విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభంకావడంతో కేంద్ర బలగాల భద్రత అనివార్యమైంది. దీన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా చేయాలని గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంకల్పించారు. దీంతో 2018 డిసెంబరులో ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత వాటికి బ్రేక్‌ పడింది. తిరిగి 2022 అక్టోబరులో అంతర్జాతీయ సర్వీసులను పునరుద్ధరించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన సెన్సిటివ్‌ విమానాశ్రయాల జాబితాలో విజయవాడ ఒకటి.

ఈ తరహా విమానాశ్రయాల్లో సీఐఎ్‌సఎఫ్‌ బలగాలను భద్రత కోసం నియమించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇక్కడికి 240-250 మంది సీఐఎ్‌సఎఫ్‌ జవాన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలోనే సీఐఎ్‌సఎఫ్‌ రావాల్సి ఉండగా, తర్వాత మార్చికి వాయిదా పడింది. ఇంతలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల విధులకు పంపడం వల్ల అది సాధ్యపడలేదు. వచ్చే నెల రెండున సీఐఎ్‌సఎఫ్‌ బృందం వస్తుందని ఏఏఐ ఉన్నతాధికారులు విజయవాడ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి విమానాశ్రయం భద్రత సీఐఎ్‌సఎఫ్‌ ఆధీనంలోకి వెళ్తుంది. దీంతో రాష్ట్ర పోలీసు సేవలను ఉపసంహరించుకోవాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి డీజీపీకి లేఖ రాశారు. ఇకపై విమానాశ్రయం బయటి ప్రదేశాలు మాత్రమే స్థానిక పోలీసుల పరిధిలో ఉంటాయి.

Updated Date - Jun 16 , 2024 | 05:55 AM