Share News

అవినీతికి ‘సహకారం’

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:21 AM

మచిలీపట్నం మండలం గోకవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో కోటి రూపాయలకు పైగా గోల్‌మాల్‌ జరిగిందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. రైతులు రుణాలను చెల్లించినప్పటికీ.. ఇంకా బకాయిలుగా రికార్డుల్లో చూపడం వివాదాస్పదమవుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన పీఏసీఎస్‌ అధ్యక్షుడు, మాజీమంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడితో పాటు పీఏసీఎస్‌ సెక్రటరీ (సీఈవో) ఈ అక్రమాలకు కారణమని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

అవినీతికి ‘సహకారం’

గోకవరం పీఏసీఎస్‌లో రూ.కోటి గోల్‌మాల్‌

రైతులు చెల్లించిన రుణాలు హాంఫట్‌

పేర్ని నాని ముఖ్య అనుచరుడు, ఓ సీఈవో అక్రమాలు

రైతుల ఆగ్రహం.. 51 విచారణ జరపాలని డిమాండ్‌

విషయం బయటపెట్టిన సూపర్‌వైజర్‌పై దాడికి యత్నం

చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

విచారణ జరపకుండా పోలీసుల జాప్యం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మూడెకరాల భూమి రైతు పేరున ఉంటే చాలు.. కేడీసీసీ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న పీఏసీఎస్‌లలో లాంగ్‌టర్మ్‌గా రూ.25 లక్షల వరకు రుణం ఇస్తారు. మచిలీపట్నం మండలం గోకవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్‌)లో అధికశాతం మంది రైతులు రొయ్యలు, పండుగప్ప చేపల సాగు, వ్యవసాయం చేస్తుండటంతో ఇలాగే లాంగ్‌టర్మ్‌ రుణాలు తీసుకున్నారు. రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే, సంబంధిత పొలం పత్రాల పరిశీలన, రిజిస్ర్టార్‌ కార్యాలయంలో మార్టిగేజ్‌ చేసే పనులను పీఏసీఎస్‌ సీఈవో భాస్కర్‌ చూసుకునేవాడు. అతనిపై ఉన్న నమ్మకంతో రైతులు రుణాలు తీసుకుని, సకాలంలో చెల్లించేసేవారు. కాగా, గోకవరం పీఏసీఎస్‌ అధ్యక్షుడు వైసీపీకి చెందిన వ్యక్తి. ఇతను మాజీమంత్రి పేర్ని నానీకి ముఖ్య అనుచరుడు. కేడీసీసీబీ పాలకవర్గంలోనూ దీర్ఘకాలం డైరెక్టర్‌గా కొనసాగాడు. కేడీసీసీబీ ప్రధాన కార్యాలయంలోని అధికారులతో తనకున్న పరిచయాలను ఆసరాగా చేసుకుని సీఈవోతో కలిసి కోటి రూపాయలకు పైగా నగదును పక్కదారి పట్టించాడని రైతులు ఆరోపిస్తున్నారు.

బయటపడింది ఇలా..

గోకవరం పీఏసీఎస్‌లో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాలు చెల్లించేశారు. తిరిగి రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా, గతంలో తీసుకున్న రుణాలు చెల్లించారా, లేదా అనే విషయంపై బ్యాంకు అధికారులు స్టేట్‌మెంట్లను తీశారు. రైతులు రుణాలు చెల్లించనట్టుగా చూపడంతో ఇదే విషయాన్ని బ్యాంకు అధికారులు రైతులకు తెలియజేశారు. అవాక్కయిన రైతులు రుణాలు చెల్లించిన సమయంలో తమకు ఇచ్చిన రసీదులను చూపారు. దీంతో బ్యాంకు అధికారులు పదిమందికి పైగా రైతులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిని ప్రారంభించారు. దీంతో పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. పీఏసీఎస్‌ అధ్యక్షుడు, సీఈవో తమను నిలువునా మోసం చేసిన విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై 51 విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. పీఏసీఎస్‌ సీఈవోకు, అధ్యక్షుడికి వివిధ రకాల వ్యాపారాలు ఉన్నాయని, రైతుల నుంచి రుణాల చెల్లింపుల రూపంలో వసూలు చేసిన నగదును తమ వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టి ఉంటారని ఆరోపిస్తున్నారు. పీఏసీఎస్‌లో నగ దు దారి మళ్లిన విషయం బయటపడటంతో సంబంధిత సీఈవో అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరాడు. వైసీపీకి చెందిన వ్యక్తి ఈ పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జిగా, కేడీసీసీబీ పాలకవర్గం డైరెక్టర్‌గా ఐదేళ్లు పనిచేశాడు. కేడీసీసీబీ ద్వారా రుణాల మంజూరులో కమీషన్‌ను తీసుకోవడంతో పాటు తాను ప్రాతినిధ్యం వహించిన గోకవరం పీఏసీఎస్‌లో అక్రమాలకు పాల్పడటంలో ఈ వైసీపీ నాయకుడు తనదైనశైలిలో వ్యవహరించేవాడనే ఆరోపణలు ఉన్నాయి.

పీఏసీఎస్‌ సూపర్‌వైజర్‌పై దాడి

గోకవరం పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మొత్తాన్ని ఇక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న జడా ప్రభాకరరావు బయటపెట్టాడనే కారణంతో అతనిపై రెండు రోజులక్రితం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దాడిచేశారు. ఈ నెల 23న విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో చిలకలపూడి గోడౌన్స్‌ సమీపంలో కాపుకాసిన ఇద్దరు వ్యక్తులు అతని కళ్లలో రసాయనాలు చల్లారు. అనంతరం దాడి చేయబోగా, అతను తప్పించుకున్నాడు. ఈ ఘటనపై బాధితుడు చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌ సీఐ నబీ తెలిపారు. గోకవరం పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేస్తామని కేడీసీసీబీ సీఈవో శ్యామ్‌ మనోహర్‌ తెలిపారు.

Updated Date - Mar 26 , 2025 | 01:21 AM