Share News

సహకారం ఆన్‌లైన్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:01 AM

జిల్లాలోని సహకార సంఘాల్లో రైతులకు పారదర్శకంగా సేవలు అందనున్నాయి.

సహకారం ఆన్‌లైన్‌
కైకలూరులో సొసైటీ రికార్డుల మూసివేతకు సర్టిఫై చేస్తున్న డీసీవో శ్రీనివాస్‌

83 సొసైటీల్లో అందుబాటులో ఆన్‌లైన్‌ సేవలు

75 సంఘాల్లో నెలాఖరు నాటికి పూర్తి

పాత రికార్డులు అప్‌డేట్‌ చేసిన అధికారులు

ఏప్రిల్‌ 1 నుంచి పూర్తిస్థాయి లావాదేవీలు

జిల్లాలోని సహకార సంఘాల్లో రైతులకు పారదర్శకంగా సేవలు అందనున్నాయి. అవినీతి,అక్రమాలకు చెక్‌పెట్టేలా ఆన్‌లైన్‌ సేవలకు అధికారులు మార్గం సుగమం చేశారు. దాదాపుగా ఏడు నెలలు నుంచి సంఘాల్లో రికార్డుల కంప్యూటరీకరణపై సుదీర్ఘ కసరత్తు చేశారు. సాఫ్ట్‌వేర్‌ అనుసంధానంతో సంఘాల పాలన తర్వాత గాడిన పడుతోంది. ఇప్పటికే దాదాపు 83 సహకార సంఘాల్లో ఆన్‌లైన్‌ సేవలందుతుండగా మిగిలిన సొసైటీల్లో నెలాఖరుకు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి జిల్లాలోని అన్ని సొసైటీల్లో ఆన్‌లైన్‌ కార్యకలాపాలు నిర్వహించనున్నారు.

ఏలూరు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సహకార సంఘాల్లో లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు రికార్డులు అప్‌డేట్‌ చేసి కంప్యూటరీకరణ వేగ వంతం చేశారు. అధికారుల నిరంతర సమీక్షలు, అవసరమైన సాంకేతిక సహకారంతో ఇప్పటికే 83 సహకార సంఘాల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో జనవరి నెలాఖరు నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా సంఘాల్లో రికార్డుల అప్‌డేట్‌ చేయడంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. అన్ని సహకార సంఘాల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించాలని సహకారశాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు విధించిన గడువు ఈ నెల 7న ముగిసింది. ఉన్నతాధికారుల అనుమతితో మిగిలిన సహకార సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తి చేయడానికి జిల్లా అధికారులు ముందడగు వేశారు. 15 రోజుల క్రితం చాలా సొసైటీల్లో 50 శాతం కూడా పాత రికార్డులు అప్‌డేట్‌ కాలేదు. కొన్ని చోట్ల 20 నుంచి 40 శాతం కూడా చేయలేదు. అధికారుల కృషితో ప్రస్తుతం దాదాపు పూర్తయ్యే దశకు వచ్చాయి. సగం సహ కార సంఘాల కంప్యూటరీకరణ పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా 75 సంఘాలకు పైగా ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయడంపైన అధికారులు దృష్టి పెట్టారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

డివిజన్‌ల వారీగా ఇలా..

ఏలూరు జిల్లా వ్యాప్తగా 158 సహకార సంఘాల కంప్యూ టరీకరణకు రూ.12 కోట్ల మేర ఖర్చుపెట్టారు. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లో జాప్యం వలన ఆన్‌లైన్‌ ప్రక్రియ సాగుతూ వచ్చింది. కైకలూరు పరిధిలో 47 సంఘాలకు 43, నూజివీడు పరిధిలో 52 సంఘాలకు 20, ఏలూరు పరిధిలో 77 సంఘా లకు 19 సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తయింది. ఇక్కడ మాన్యువల్‌గా బిల్లులు రాయడం నిలిపేశారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను జిల్లా సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్‌ తనిఖీ చేసి, ఆన్‌లైన్‌ కోసం సర్టిఫికెట్‌ ఇవ్వనున్నారు. 75 సంఘాల్లో వేగంగా పూర్తికాకపోవడానికి ప్రధానంగా ఇక్కడ పెట్రోల్‌ బంకులు, జన ఔషధి (జనరిక్‌ మందుల) షాపులు, సూపర్‌ బజార్లు తదితర వ్యాపారాలు సాగుతున్నాయి. సాంకే తికపరంగా ఇక్కడ డేటా అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పాత లావాదేవీల డేటా ఎంట్రీలను పూర్తి చేశారు.

పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ లావాదేవీలు

సహకార సంఘాల కంప్యూటరీకరణ ఈ నెలాఖరుకు పూర్తికానుంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నాం. ఇంకా 75 సంఘాల్లో కంప్యూటరీకరణ పూర్తి కావలసి ఉంది. ఏప్రిల్‌ 1 నుంచి జిల్లావ్యాప్తంగా అన్ని సంఘాల్లో ఆన్‌లైన్‌ లావాదేవీలు రైతులు, సొసైటీల వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తాం.

ఆరిమిల్లి శ్రీనివాస్‌, జిల్లా సహకార శాఖ అధికారి

Updated Date - Mar 26 , 2025 | 01:01 AM