అసైన్డ్ అక్రమాలు
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:05 AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై కల్పించిన వెసులుబాటు రెవెన్యూ అధికారులకు కలసి వచ్చింది. అనాదిగా ఉన్న భూములను అమ్ముకోవడానికి నాటి ప్రభుత్వం నిబంధనలు సడలించింది.

వైసీపీ హయాంలో దందా
మొగల్తూరు మండలంలో 200 ఎకరాలు పరాధీనమైనట్టు అంచనా
లంచాలు మింగి పట్టాలు ఇచ్చిన అధికారులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై కల్పించిన వెసులుబాటు రెవెన్యూ అధికారులకు కలసి వచ్చింది. అనాదిగా ఉన్న భూములను అమ్ముకోవడానికి నాటి ప్రభుత్వం నిబంధనలు సడలించింది. తాజాగా అసెన్డ్ భూములు, డి–నమూనా భూములను అను భవిస్తున్న వారిపేరుతో మార్పు చేయాలని దిశానిర్దేశం చేసింది. దీనిని కొందరు పెద్దలు తమకు అనుకూలంగా మలచుకున్నారు. పెద్దల నుంచి లంచాలు తీసుకుని అధికారులు పట్టాలు ఇచ్చేశారు. ముఖ్యంగా మొగల్తూరు మండలంలో దాదాపు 120 ఎకరాలు ఇలా అన్యాక్రాంతమయ్యాయి. భూములను అనుభవిస్తున్న వారి పేరుతో ఉచితంగా పట్టాలు ఇచ్చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు నిబంధనలను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేశారు. తీర ప్రాంతంలో ఎకరానికి రూ.40 వేలకు పైగా తీసుకుని పట్టాలు ఇచ్చేసిన ఘనత రెవెన్యూ అధికారులు మూటగట్టుకున్నారు. ఎన్నికల ముందు ఇటువంటి దందా మొగల్తూరు మండలంలో నిర్విఘ్నంగా కొనసాగింది. కాసులపై ఆశ పడ్డ అధికారులు మొగల్తూరు మండలంపై ఆసక్తి చూపడం పరిపాటిగా మారిపోయింది. నిబంధ నలను కాలరాసి అక్రమాలకు తావివ్వడం సదరు మండలంలో ఆనవాయితీ అయి పోయింది. వైసీపీ ప్రభుత్వంలో ఇటువంటి దందా తారస్థాయికి చేరింది. నిషేధిత జాబితా నుంచి మినహాయింపు ఇచ్చిన భూములకు పట్టాలు ఇచ్చేశారు. దీనిపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. క్షేత్ర స్థాయిలో అధికారు లను కలవాలంటూ పెద్దలు సూచించారు. తీరా రెవెన్యూ అధికారులను కలిస్తే గతంలో అటువంటి మార్పులు ఏమీ జరగలేదంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు.
నిబంధనల సడలింపు ఇలా
అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించడానికి వైసీపీ హయాంలో వెసులుబాటు ఇచ్చారు. అసైన్డ్ భూములను పొంది 20 ఏళ్లు దాటితే అమ్ముకునే వీలు కల్పించారు. రిజిస్ర్టేషన్ చేసేలా నిబంధనలు సడలించారు. జిల్లాలో కేవలం రెండు ఎకరాల లోపు మాత్రమే రిజిస్ర్టేషన్ చేశారు. వైసీపీ హయాంలో ప్రకటించిన ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ర్టేషన్‌లపై కూటమి ప్రభుత్వం ఆరా తీసింది. జిల్లాలో నెల రోజలు పాటు సుదీర్ఘ కసరత్తు చేశారు. ప్రతి సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో వివరాలను సేకరించారు. జిల్లా రిజిస్ర్టేషన్ శాఖ ప్రభు త్వానికి నివేదిక పంపింది. గరిష్టంగా రెండు ఎకరాలు మాత్రమే రిజిస్ర్టేషన్ చేసి నట్టు ప్రభుత్వానికి వివరాలు సమర్పించారు. ఆ లెక్కన చూస్తే అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు.
అడంగల్‌లోనూ మార్పులు చేశారా ?
రిజిస్ర్టేషన్ జరిగితేనే అడంగల్‌లో పేరు మార్పిడి చేయాల్సి ఉంటుంది. భూములను కొనుగోలు చేసిన వ్యక్తి పేరుతో రిజిస్ర్టేషన్ అయితే రెవెన్యూశాఖ అండంగల్‌లో మార్పు చేయాల్సి ఉంటుంది, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు దారుని పేరుతో భూమి ఉంటుంది. మొగల్తూరు మండలంలోని మూడు గ్రామాల్లో మాత్రం కొనుగోలు లేకుండా, రిజిస్ర్టేషన్‌లు నిర్వహించకుండానే పట్టాలు మారిపోయాయి. అడంగల్‌లోనూ పేర్లు మార్చేశారు. ఇదే విషయంపై ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లాయి. అప్పట్లో వైసీపీ నాయకుల హస్తం కూడా ఉంది. వారిపేరుతోనూ కొంత భూమిని పట్టాలు చేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. అప్పటి అధికారులకు ముడుపులు ముట్టచెప్పి రికార్డులను తారు మారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు మాత్రం ఎటువంటి అక్రమాలు లేవంటూ కొట్టి పారేస్తున్నారు.