ఇక ఆధునిక ఐజీఎంఎస్
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:18 AM
: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌తో పాటు ఎన్నో రంజీ మ్యాచ్‌లు నిర్వహించిన నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కొత్తరూపు సంతరించుకోనుంది. ఇప్పటివరకు భారీ సభల నిర్వహణకు, స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు కేంద్రంగా ఉన్న ఈ స్టేడియాన్ని ఇకపై జాతీయ క్రీడలు నిర్వహించేందుకు వీలుగా అభివృద్ధి చేయాలని క్రీడాప్రాధికార సంస్థ (శాప్) అధికారులు భావిస్తున్నారు.

ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి అడుగులు
తమకు అప్పగించాలని వీఎంసీకి శాప్ లేఖ
జాతీయ క్రీడల నిర్వహణకు అనువుగా ఆధునికీకరణ
రూ.10 కోట్లతో సింథటిక్ ట్రాక్‌ల అభివృద్ధికి ప్రణాళిక
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌తో పాటు ఎన్నో రంజీ మ్యాచ్‌లు నిర్వహించిన నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం కొత్తరూపు సంతరించుకోనుంది. ఇప్పటివరకు భారీ సభల నిర్వహణకు, స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలకు కేంద్రంగా ఉన్న ఈ స్టేడియాన్ని ఇకపై జాతీయ క్రీడలు నిర్వహించేందుకు వీలుగా అభివృద్ధి చేయాలని క్రీడాప్రాధికార సంస్థ (శాప్) అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి నిమిత్తం స్టేడియాన్ని తమకు అప్పగించాలని శాప్ అధికారులు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులకు కొద్దిరోజుల క్రితం లేఖ కూడా రాశారు.
రూ.10 కోట్లతో సింథటిక్ ట్రాక్‌లు
స్టేడియం ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆధీనంలో ఉంది. గ్యాలరీలకు దిగువన ఉన్న గదులను వివిధ క్రీడా సంఘాలు ఉపయోగించుకుంటున్నాయి. స్టేడియం లోపల ఆడుకోవడానికి ప్రాంగణం, రన్నింగ్ ట్రాక్ ఉంది. క్రికెట్ ప్రాక్టీస్‌కు నెట్, వాలీబాల్, త్రోబాల్, ఫుట్‌బాల్ కోర్టులు ఉన్నాయి. మున్సిపల్ వాటర్ ట్యాంక్ వైపున టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. కాగా, 2028-29లో ఈ స్టేడియంలో జాతీయ క్రీడలు నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు వీలుగా స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని శాప్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అథ్లెటిక్స్ నిర్వహించడానికి అనువుగా ఇక్కడ ట్రాక్ లేదు. ఈ నేపథ్యంలో రూ.10 కోట్లతో సింథటిక్ ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 100, 200, 400 మీటర్ల పరుగులు, హర్డిల్స్ నిర్వహించేలా ఈ ట్రాక్ నిర్మించాలని భావిస్తున్నారు. స్టేడియానికి బయట ఉన్న ఫుట్‌బాల్ కోర్టు వద్ద 200 మీటర్ల సింథటిక్ ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. ఇటీవల ఈ స్టేడియంలో ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు నిర్వహించినప్పుడు అథ్లెటిక్స్ కోసం తాత్కాలికంగా ఎర్రమట్టితో ట్రాక్‌లను ఏర్పాటు చేశారు.
వీఎంసీ కౌన్సిల్‌లో చర్చ
ఆధునికీకరణ జరగాలంటే కార్పొరేషన్ అధికారులు స్టేడియాన్ని శాప్‌కు అప్పగించాలి. శాప్ రాసిన లేఖపై కొద్దిరోజుల క్రితం వరకు వీఎంసీ అధికారులు తర్జనభర్జన పడ్డారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో స్టేడియాన్ని శాప్‌కు అప్పగించేద్దామన్న అభిప్రాయాన్ని పలువురు కార్పొరేటర్లు వ్యక్తం చేశారు. అయితే, దీనిపై ఎలాంటి తీర్మానం చేయలేదు.