Amaravarti : లోకేశ్ ఫ్లెక్సీ పెట్టామని హోటల్ మూయించారు
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:45 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత లోకేశ్ జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీ పెట్టామని తన హోటల్ మూయించారని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన ప్రకాశ్ బాబు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు.
మంత్రి సంధ్యారాణికి తంబళ్లపల్లె బాధితుని ఫిర్యాదు
వైసీపీ వ్యక్తులు అత్యాచారయత్నం చేసి, చంపాలని చూశారు
ఊరు విడిచివెళ్లకుంటే ప్రాణాలు దక్కవని డీఎస్పీ చైతన్య బెదిరించారు
టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన బాధితులు
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత లోకేశ్ జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీ పెట్టామని తన హోటల్ మూయించారని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన ప్రకాశ్ బాబు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఆమె ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అశోక్‌బాబుతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మాస్క్ పెట్టుకోలేదన్న సాకు చూపించి తనపై తప్పుడు కేసులు కూడా వైసీపీ నేతలు పెట్టించారని, తనకు న్యాయం చేయాలని ప్రకాశ్ బాబు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
వైసీపీకి చెందిన వ్యక్తులు తనపై అత్యాచార యత్నం చేయడంతోపాటు చంపాలని కూడా ప్రయత్నించారని, ఊరు విడిచి వెళ్లకపోతే ప్రాణాలు దక్కవని అప్పటి డీఎస్పీ చైతన్య తననే బెదిరించారని అన్నమయ్య జిల్లాకు చెందిన సరోజ అనే మహిళ ఫిర్యాదు చేశారు. వైసీపీ గుండాలపైనా, వారికి కొమ్ము కాసిన పోలీస్ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ మద్దతుదారుల ప్రోద్భలంతో ఎస్సై, కానిస్టేబుళ్లు తమను కొట్టి హింసించారని, వారిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా శింగనమల మండలం సలకం చెరువుకు చెందిన దళితులు తాడి మేరి తిరపాలు, రాజా రాముడు విజ్ఞప్తి చేశారు.
ఐదేళ్లు వైసీపీలో తిరిగిన వ్యక్తులు ఎన్నికలు కాగానే టీడీపీలో చేరి పార్టీలో మొదటి నుంచి ఉన్న దళితులకు పదవులు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై పార్టీపరంగా విచారణ చేయాలని ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం శింగనపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కోరారు. చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం తిరుమలయ్య పల్లి పంచాయతీ మాకాంబికాపురంలో పశువుల మేత పోరంబోకు, కాల్వ పోరంబోకు భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించారని, వారిపై చర్యలు తీసుకోవాలని చెంగల్రాయరెడ్డి వినతి పత్రం ఇచ్చారు.
చిత్తూరు జిల్లా హోం గార్డుల వినతి
చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న తమను గత ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆదేశం వల్ల 120 కిలోమీటర్ల దూరంలోని అన్నమయ్య జిల్లాలో పనిచేయాలని చెబుతున్నారని, చాలీచాలని జీతాలతో అంత దూరం వెళ్లి పనిచేయలేమని, సొంత జిల్లాలో ఉండేలా చూడాలని పదుల సంఖ్యలో వచ్చిన హోం గార్డులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ఎస్పీకి ఫోన్ చేసిన మంత్రి వారి సమస్యను పరిశీలించాలని సూచించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల పరిధిలో 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, వారిని పర్మినెంట్ చేయాలని... యాజమాన్యాలే నేరుగా జీతాలు ఇచ్చేలా చూడాలని ఏపీ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. 1998 డీఎస్సీ ద్వారా ఎంపికైన తమకు 2023లో నియామకాలు ఇచ్చారని, పరీక్ష రాసిన జిల్లాల్లో కాకుండా తాము స్థిరపడిన జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చేలా చూడాలని వారు కోరారు.
జాతీయ స్థాయికి ఎదగడానికి..
ఆప్కాస్ ద్వారా విశాఖ కేజీహెచ్, అనకాపల్లి మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న తమకు అనేక నెలల నుంచి జీతాలు రావడం లేదని కొందరు నాలుగో తరగతి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తన తండ్రి తోపుడు బండి మీద పండ్లు అమ్ముతాడని, తాను పరుగు పందెంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో 26 పతకాలు సాధించానని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ అబ్దుల్లా చెప్పారు. తాను జాతీయ స్థాయికి ఎదగడానికి తర్ఫీదుకు నెలకు రూ.15 వేలు ఖర్చవుతుందని, దానికి సాయం చేయాలని అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు.