Guntur ZP Chairperson Christina : రూ.30 కోట్ల స్థలం కోసం.. అంబటి బెదిరించాడు!
ABN , Publish Date - Jun 28 , 2024 | 04:59 AM
‘పల్నాడు జిల్లా సత్తెనపల్లి మెయిన్ రోడ్డు పక్కన జిల్లా పరిషత్‌కు రూ.30 కోట్లు విలువ చేసే 2.74 ఎకరాల భూమి ఉంది. దానిని కాజేసేందుకు అప్పటి మంత్రి అంబటి రాంబాబు చాలా ప్రయత్నం చేశాడు.
గుంటూరు జడ్పీ చైర్పర్సన్ సంచలన ఆరోపణ
సత్తెనపల్లిలో 2.74 ఎకరాలకు పట్టాలు రాసిమ్మని నాపై ఒత్తిడి
నీ సంగతి తేలుస్తానన్నాడు
జగన్‌కు ఫిర్యాదు చేస్తానన్నాడు
మంగళగిరి జడ్పీ స్థలంలో ఆళ్ల అక్రమ నిర్మాణం
2 వేల ఎకరాలు కాపాడేందుకు
వైసీపీ ముఖ్యులతో యుద్ధం చేశా: క్రిస్టీనా
గుంటూరు సిటీ, జూన్ 27: ‘పల్నాడు జిల్లా సత్తెనపల్లి మెయిన్ రోడ్డు పక్కన జిల్లా పరిషత్‌కు రూ.30 కోట్లు విలువ చేసే 2.74 ఎకరాల భూమి ఉంది. దానిని కాజేసేందుకు అప్పటి మంత్రి అంబటి రాంబాబు చాలా ప్రయత్నం చేశాడు. దానికి పట్టాలు రాసిమ్మని నాపై ఒత్తిడి తెచ్చాడు. నేను ఒప్పుకోలేదు. నన్ను చాలా బెదిరించాడు. నీ సంగతి తేలుస్తానన్నాడు. సీఎంకి ఫిర్యాదు చేస్తానన్నాడు.
ఏమైనా చేసుకో ఆ భూమి నీకు ఇచ్చేది లేదని చెప్పా..’ అని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టీనా తెలిపారు. గురువారమిక్కడ తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌కు చెందిన 2 వేల ఎకరాల భూమిని కాపాడేందుకు కొందరు వైసీపీ ముఖ్య నేతలతో యుద్ధం చేశానని చెప్పారు. సత్తెనపల్లి మున్సిపాలిటీ సమీపంలో ఉన్న జడ్పీ స్థలాన్ని తన అనుచరులకు కట్టబెట్టేందుకు కూడా అంబటి రాంబాబు నానా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఆ స్థలానికి సంబంధించిన తీర్మానం జిల్లా పరిషత్ సమావేశంలో ప్రవేశపెట్టగా అందరూ వ్యతిరేకించారని..
చివరకు పంచాయతీరాజ్ కమిషనర్ కూడా జడ్పీ స్థలానికి పట్టాలివ్వడం కుదరదని చెప్పారని తెలిపారు. మంగళగిరి హైవే పక్కన జిల్లా పరిషత్‌కు చెందిన 40 సెంట్ల భూమిలో అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్రమంగా ప్రవేశించి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించారని ఆరోపించారు. ఆ స్థలం జిల్లా పరిషత్దని బోర్డు పెట్టినప్పటికీ దానిని తీసివేయించి మరీ అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారన్నారు. మంగళగిరి ఊరి నడిబొడ్డున ఉన్న 40 సెంట్ల జిల్లా పరిషత్ స్థలంలోనూ ఇదే రీతిలో భవనాలు నిర్మించారన్నారు.
వైసీపీ నేతల బారి నుంచి జడ్పీ ఆస్తులను కాపాడేందుకు మొట్టమొదటి సారిగా జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశానన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా మూడేళ్లుగా ఉన్నప్పటికీ కేవలం ఉత్సవ విగ్రహం మాదిరిగానే మిగిలానని.. నిధులు, విధులు లేకుండా చేసి దళితులకు పదవులిచ్చానని జగన్ ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. వైసీపీలో ఉండి అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. చంద్రబాబు మాత్రమే రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతో పదవిని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ముందు టీడీపీలో చేరానని చెప్పారు.