Duvvada episode : దువ్వాడ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్!
ABN , Publish Date - Aug 12 , 2024 | 03:56 AM
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన భార్య, కుమార్తెల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఆగి ఉన్న కారును ఢీకొట్టి
మాధురి ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం కేజీహెచ్‌కు,
అక్కడి నుంచి అపోలోకు తరలింపు
మొదట పలాస ఆస్పత్రిలో హైడ్రామా
పోలీసులు ఇబ్బంది పెట్టారంటూ ఆరోపణ
పలాస, ఆగస్టు 11: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆయన భార్య, కుమార్తెల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె కారులో ప్రయాణిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మిపురం టోల్‌గేటు దాటిన తరువాత ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో గాయపడిన ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా.. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్సకోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాధురి విలేకరులతో మాట్లాడుతూ తన పిల్లలపై దువ్వాడ వాణి చేసిన ఆరోపణలకు తాను బలికావాల్సి వస్తోందని, ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు గత్యంతరం లేదని తెలిపారు. వాణిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ సహకారంతోనే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇదే క్రమంలో ఆమె పోలీసులపైనా ఆరోపణలు చేశారు. ఆమెను మరింత మెరుగైన చికిత్స కోసం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆరిలోవలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తరువాత సంబంధిత డ్రైవర్లకు ఇటువంటి పరీక్షలు చేయడం సాధారణమని, ప్రమాదం జరిగిన కారును మాధురి స్వయంగా డ్రైవింగ్ చేస్తున్నారని, ఇందులో రాజకీయ కోణం ఏదీ లేదని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పారినాయుడు తెలిపారు.
ఆత్మహత్యకు అవకాశం ఇవ్వండి: మాధురి
పలాస ఆసుపత్రిలో మాధురి వైద్యులకు సహకరించలేదు. తనకు ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తన పిల్లలకు డీఎన్‌ఏ టెస్టులు చేయాలని దువ్వాడ వాణి కోరారని, వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అడ్డూఅదుపు లేకుండా వాణి అధికార పార్టీ అండతో ఆరోపణలు చేస్తే తనకు దిక్కెవరని ప్రశ్నించారు. తన పిల్లలు వేసే ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పాలని వాపోయారు. తనపై ఆరోపణలు చేస్తున్నవారిని తక్షణమే అరెస్టు చేయాలని.. లేదంటే తన చావుకు ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను కోరారు. ఆసుపత్రిలో పోలీసులు ఇబ్బందులు పెట్టారని మాధురి ఆరోపించారు. ‘‘బ్రీత్ అనలైజేషన్, బ్లడ్ శాంపిల్ తీశారు. విలేకరుల సమక్షంలో చేయాలని కోరినా పోలీసులు అనుమతించలేదు. రాజకీయం చేయాలని చూశారు. పోలీసులు సీక్రెట్‌గా ఎందుకు ఈ విధంగా చేశారో సమాధానం చెప్పాలి’’ అని మాధురి డిమాండ్ చేశారు.
దువ్వాడను సస్పెండ్ చేయాలి: వాణి
మూడో రోజూ భర్త ఇంటి వద్ద కొనసాగిన దీక్ష
టెక్కలి, ఆగస్టు 11: ‘మా కుటుంబానికి న్యాయం చేయని వ్యక్తి.. ఎమ్మెల్సీగా ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు?. ఓ మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని బరితెగించి మాట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివా్‌సను సస్పెండ్ చేయాలి’ అని ఆయన భార్య, టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద మూడో రోజు ఆదివారం కూడా ఆమె నిరసన దీక్ష కొనసాగించారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. అయితే శ్రీనివాస్ మాత్రం బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు. మూడురోజులుగా ఈ వ్యవహారంపై రచ్చ జరగడంతో ఆదివారం కూడా పోలీసులు దువ్వాడ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.