Share News

YSR Congress Party: వైసీపీకి వేసవి సెలవులు

ABN , Publish Date - Mar 28 , 2025 | 02:56 AM

వైసీపీ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలను వానాకాలం వచ్చేవరకు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వేసవి తీవ్రత కారణంగా, పునరాలోచన చేసి, పార్టీ కార్యమాలపై సెలవులు ప్రకటించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు

YSR Congress Party: వైసీపీకి వేసవి సెలవులు

వానాకాలం వచ్చేదాకా కార్యక్రమాల్లేవ్‌.. ప్రతి గురువారం బెంగళూరుకు జగన్‌

లోక్‌సభ స్థానంలో మూడేసి రోజులు బస చేస్తానంటూ గతంలో హామీ

జిల్లాల్లో పర్యటిస్తాననీ ప్రకటన.. అతీగతీ లేదని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి

అమరావతి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వేసవి సెలవులు ప్రకటించేశారా? వానాకాలం వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలు చేపట్టే యోచనే లేదా? ..వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు వీటిపైనే చర్చ జరుగుతోంది. జగన్‌ దంపతులు గడచిన కొన్ని నెలలుగా ప్రతి గురువారం బెంగళూరు యలహంక ప్యాలెస్‌కు వెళ్తున్నారు. తిరిగి సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం తాడేపల్లి ప్యాలె్‌సకు చేరుకుంటున్నారు. అంటే.. గట్టిగా రెండ్రోజులు మాత్రమే తాడేపల్లిలో బస చేస్తున్నారు. ఈ రెండు రోజుల విడిదిలోనూ జగన్‌ పార్టీ తరఫున ప్రత్యేక కార్యక్రమాలేమీ చేపట్టడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన రైతు పోరు, విద్యుత్‌ చార్జీల పోరు, యువత (ఫీజు) పోరు ఆందోళనల బాధ్యతలను పార్టీలో మిగిలి ఉన్న ముఖ్య నేతలపైనే వేసేశారు. తానెక్కడా పాల్గొనలేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోటరీలో కీలకమైన నేతలుగా చెలామణి అయిన వారెవరూ ఈ నిరసనల్లో పాల్గొనడం లేదు. పైగా వాటికి ప్రజాస్పందన కూడా లేదు. అయినా భారీ స్థాయిలో ఉద్యమించినట్లుగా ఐప్యాక్‌ బృందం మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు చూపింది. యువత పోరులో పాల్గొనేందుకు విద్యార్థులను పంపాలని కాలేజీల యాజమాన్యాలతో వైసీపీ స్థానిక నేతలు గొడవ పడిన ఉదంతాలు బయటపడ్డాయి. విద్యార్థుల బదులు 45 ఏళ్లు పైబడినవారిని తీసుకొచ్చి నిలబెట్టారు. దీంతో ఈ ఆందోళన నవ్వులపాలైంది. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి.


ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు జనం రావడం లేదు. పార్టీ నేతలు జన సమీకరణ కూడా చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆందోళనలపై జగన్‌ పునరాలోచనలో పడ్డారని, వేసవి తీవ్రత తగ్గేంతవరకూ.. అంటే వానాకాలం వచ్చి వాతావరణం చల్లబడేవరకు నిరసనలు, పార్టీ సమావేశాలు చేపట్టకూడదని నిర్ణయించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది ఒక విధంగా వైసీపీకి వేసవి సెలవులు ప్రకటించినట్లేనని అంగీకరిస్తున్నారు.

జిల్లా టూర్ల ఊసేదీ?

సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వస్తానని.. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు సమీక్షలు నిర్వహిస్తానని డిసెంబర్లో జరిగిన ముఖ్య నేతల భేటీలో జగన్‌ చెప్పారు. ఆ తర్వాత ప్రతి లోక్‌సభ స్థానంలో మూడేసి రోజులు బస చేసి.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కీలక నిర్ణయాలు తీసుకుంటానన్నారు. కానీ ఉగాది వస్తున్నా.. ఆ ఊసే ఎత్తడం లేదు.


For More AP News and Telugu News

Updated Date - Mar 28 , 2025 | 02:56 AM