Somesh Kumar: పని తెలంగాణలో.. చెల్లింపులు ఏపీలో!
ABN , Publish Date - Oct 06 , 2024 | 05:22 AM
అఖిల భారత సర్వీసులో ఉన్న వారు ఎక్కడ పని చేస్తే అక్కడ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతారు. వేతనాలు, వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి సంబంధిత రాష్ట్రమే చెల్లించాలి.
రాష్ట్రం నెత్తిన సోమేశ్ భారం
రూ.3 లక్షల మెడికల్ ఖర్చులు చెల్లింపు
ఒక్క రోజు కూడా ఇక్కడ పని చేయని అధికారి
టీ-హైకోర్టు ఆదేశాలతో వచ్చి.. వెంటనే వీఆర్‌ఎస్
క్షణాల్లో ఆమోదం.. తర్వాత పొరుగు రాష్ట్రానికి
అక్కడ సలహాదారుగా బాధ్యతల స్వీకారం
కానీ, రిటైర్మెంట్ ప్రయోజనాలన్నీ ఏపీ నుంచే
తెలంగాణలో పనిచేసిన వారికి.. ఏపీ ఖజానా నుంచి వేతనాలు ఇవ్వాల్సి వస్తే ఏమనుకోవాలి? రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాల్సి వస్తే ఎలా చూడాలి? అచ్చం ఇప్పుడు ఇలాంటి పరిస్థితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. తెలంగాణలో పనిచేసి.. ఏపీలో వీఆర్‌ఎస్ తీసుకున్న మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్‌కు వైద్య ఖర్చులతోపాటు రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించే బాధ్యత కూడా రాష్ట్రంపైనే పడింది. చిత్రంగా ఉన్న ఈ వ్యవహారంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): అఖిల భారత సర్వీసులో ఉన్న వారు ఎక్కడ పని చేస్తే అక్కడ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతారు. వేతనాలు, వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి సంబంధిత రాష్ట్రమే చెల్లించాలి. కానీ, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్ ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్‌కు మాత్రం ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా సోమేశ్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వం రూ.3 లక్షల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను మంజూరు చేసింది. ఈ మేరకు జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, వాస్తవానికి సోమేశ్‌కుమార్ విభజిత ఏపీలో ఒక్క గంట కూడా పని చేయలేదు. అయినా.. ఇలా ఎందుకు ఇస్తున్నారన్నదే ప్రశ్న.
ఏం జరిగింది?
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్‌ను ఏపీకి కేటాయించారు. అయితే, ఆయన డీవోపీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ.. ‘నేను ఏపీకి పోను’ అని భీష్మించుకుని తెలంగాణలో కొనసాగారు. అప్పటి తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అయితే, ఈ వ్యవహారం వివాదాస్పదమై.. హైకోర్టు వరకు వెళ్లింది. ఆయా పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఏపీ కేడర్‌కు నియమితులైన సోమేశ్‌కుమార్ ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన 2023, జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు.
ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వాలంటరీ రిటైర్మెంట్(వీఆర్‌ఎస్) తీసుకుని వెళ్లిపోయారు. ఒక్క గంట కూడా ఆయన ఏపీలో పని చేయలేదు. ఆయన వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు పెట్టిన వెంటనే నాటి జగన్ ప్రభుత్వం క్షణాల్లో ఆమోదించింది. ఆ మరుసటి రోజునే ఆయన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. అలాంటి సోమేశ్‌కుమార్‌కు తాజాగా ఏపీ ప్రభుత్వం లక్షల రూపాయిల ప్రజాధనాన్ని చెల్లిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. అదేవిధంగా ఆయన పదవీ విరమణ ప్రయోజనాలు కూడా రూ.లక్షల్లో ఉండనున్నాయి. వీటితో పాటు పెన్షన్, ఇతర బెనిఫిట్స్ మొత్తం ఏపీనే ఇవ్వాల్సి ఉంది. చివరికి ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా ఆ చికిత్సకు అయ్యే ఖర్చు ఏపీనే భరించాల్సి వస్తోంది.
పనిష్మెంట్ ఏదీ?
విభజన తర్వాత ఏపీకి రానని భీష్మించుకుని తెలంగాణలో కూర్చున్న సోమేశ్ కుమార్‌కు ఏపీ ఖజానా నుంచి చెల్లింపులు చేయడం ఏమిటన్న ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. మరి ఒక్క రోజు కూడా ఏపీలో పని చేయని సోమేశ్‌కుమార్‌కు ఏపీ నుంచి బెనిఫిట్స్ ఎందుకివ్వాలని ఉద్యోగ వర్గాల్లో చర్చసాగుతోంది. ఇదిలావుంటే, ఒక ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్ తర్వాత ఏడాది పాటు ఎక్కడా ఉద్యోగం చేయకూడదు.
అంతేకాదు, ప్రభుత్వం అనుమతి లేకుండా అసలు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కల్పించే బాధ్యతను కూడా భుజాన వేసుకోకూడదు. అలా చేసిన వారికి పెన్షన్ కట్ చేయడంతో పాటు పనిష్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ, సోమేశ్‌కుమార్.. వీఆర్‌ఎస్ తీసుకున్న తర్వాత నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారులో సలహాదారుగా చేరిపోయారు. ఇది భారీ ఆర్థిక ప్రయోజనం కల్పించే పోస్టు. ఈ నేపథ్యంలో సోమేశ్ కుమార్ తెలంగాణలో పెన్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందడం నైతికత. కానీ, రూల్స్‌ను గుడ్డిగా ఫాలో అవుతూ.. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఇలా చెల్లింపులు చేయడం పట్ల అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.