Janasena: సాయిధరమ్ తేజ్‌పై వైసీపీ మూకల దాడి.. అసలేం జరిగింది..?
ABN , Publish Date - May 06 , 2024 | 03:36 AM
సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌పై ఆదివారం రాత్రి వైసీపీ మూకలు డ్రింక్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాయి. సరిగ్గా బాటిల్ పడే సమయంలో తేజ్ తప్పించుకోవడంతో పక్కనే ఉన్న జనసైనికుడికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి..
డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మూకలు
త్రుటిలో తప్పించుకున్న తేజ్
పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు
అంతకుముందే వైసీపీ కవ్వింపు చర్యలు
కాకినాడ జిల్లా రోడ్‌షోలో తీవ్ర ఉద్రిక్తత
గొల్లప్రోలు రూరల్, మే 5: సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌పై (Sai Dharam Tej) ఆదివారం రాత్రి వైసీపీ (YSR Congress) మూకలు డ్రింక్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాయి. సరిగ్గా బాటిల్ పడే సమయంలో తేజ్ తప్పించుకోవడంతో పక్కనే ఉన్న జనసైనికుడికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సాయిధరమ్‌తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట వెళ్లేందుకు తాటిపర్తి మీదుగా వెళ్తున్నారు. అప్పటికే తాటిపర్తి గ్రామ వీధులన్నీ జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, మెగా అభిమానులతో నిండిపోయాయి. వారిని చూసి వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. తేజ్ కాన్వాయ్ తాటిపర్తి మీదుగా వెళ్తుండగా బాంబులు వేసి బాణాసంచా కాల్చారు.
ఈ సమయంలో జనసేన, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ఈ గొడవ సద్దుమణగకుండానే చినజగ్గంపేటలో రోడ్‌షో ముగించుకున్న సాయిధరమ్‌తేజ్.. తాటిపర్తి గజ్జాలమ్మ సెంటర్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి సమీపంలో గుమిగూడి ఉన్న వైసీపీ శ్రేణుల్లో నుంచి ఒకరు డ్రింక్ బాటిల్‌ను ఆయన పైకి విసిరారు. దానినుంచి తేజ్ తప్పించుకోగా ఆ బాటిల్ పక్కనే ఉన్న జనసైనికుడు నల్లల శ్రీధర్‌కు తగిలి కంటిపై, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సాయిధరమ్‌తేజ్ తన రోడ్‌షో ముగించుకుని వెళ్లిపోయారు. బాధితుడిని హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, గాయపడిన శ్రీధర్‌ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ పరామర్శించారు.