Bhupathi Raju : ఏపీలో పరిశ్రమల స్థాపనకు కృషి
ABN , Publish Date - Jun 19 , 2024 | 05:06 AM
ఆంధ్రప్రదేశ్‌లో నూతన పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని భరోసానిచ్చారు.
విశాఖ ఉక్కు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట: శ్రీనివాసవర్మ
న్యూఢిల్లీ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నూతన పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని భరోసానిచ్చారు. మంగళవారం ఢిల్లీలోని ఉద్యోగ భవన్‌లో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉదయం 11 గంటలకు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా 12 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడచిన ఐదేళ్లలో ఏపీలో పారిశ్రామిక విధ్వంసం జరిగిందని, కొత్త పరిశ్రమలు రాకపోగా రాష్ట్రం నుంచే పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి, వారితో సమావేశం నిర్వహించిన తర్వాత విశాఖ ఉక్కుపై సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్ దెబ్బతినకుండా ఏపీ ప్రజల ప్రయోజనాలు కాపాడుతానని తెలిపారు. నరసాపురం పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో లోక్‌సభ నియోజకవర్గ అభివృద్థికి పెద్దపీట వేస్తానని చెప్పారు. బాధ్యతలు స్వీకరించినవర్మకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, ఆరిమిల్లి రాధాకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పితాని సత్యనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.