దుర్గమ్మ సన్నిధిలో ఖడ్గమాలా నామార్చనలో బొల్లినేని కృష్ణయ్య.. పురాణపండపై వాణీమోహన్ ప్రశంసలు
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:39 PM
శ్రీవిద్యోపాసనలో అత్యంత ప్రధానమైన శ్రీదేవి ఖడ్గమాలానామాలతో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ పాదాల చెంత శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవడం తమ కుటుంబానికి ఎంతో ఎంతో సంతోషాన్నించ్చిందని భారతదేశమంతటా అనేక శాఖలతో విస్తరించిన కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య పేర్కొన్నారు.
విజయవాడ, జూన్ 28: శ్రీవిద్యోపాసనలో అత్యంత ప్రధానమైన శ్రీదేవి ఖడ్గమాలానామాలతో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ పాదాల చెంత శ్రీచక్రానికి కుంకుమార్చన చేసుకోవడం తమ కుటుంబానికి ఎంతో ఎంతో సంతోషాన్నించ్చిందని భారతదేశమంతటా అనేక శాఖలతో విస్తరించిన కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారు ఝామువేళ విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజల్లో కుటుంబ సమేతంగా ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. సనాతన ధర్మం విషయంలో ఆలయ జ్ఞానం, ఉపాసనా దృష్టి, భక్తజనుల సంరక్షణల పట్ల అవగాహన సమృద్ధిగా ఉన్న కె.ఎస్.రామారావు వంటి యజ్ఞ భావనల నిస్వార్ధ కార్యనిర్వహణాధికారి అరుదుగా ఉంటారని, రామారావు సేవల్ని ప్రభుత్వం మరింత ఉన్నతంగా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతుల సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ మహోజ్వల వైభవాన్ని సంతరించుకోవాలని కోరుతూ బొల్లినేని కృష్ణయ్య , సుజాత దంపతులు సమర్పణలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనలైన వైదిక విస్తార సాధనల ‘శ్రీమాలిక’, మంగళగిరి నృసింహ భగవానుని తేజస్సుల ‘నారసింహో ... ఉగ్రసింహో’ దివ్య గ్రంథాల్ని అమ్మవారి పూజల్లో పాల్గొనడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కమీషనర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ జి. వాణీమోహన్‌కి బొల్లినేని కృష్ణయ్య అందజేశారు.
శాస్త్ర ప్రమాణాల సమన్వయంతో ఈ పరమాద్భుత గ్రంధాలను రచించి సంకలనం చేసిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ను ఈ సందర్భంలో డాక్టర్ వాణీమోహన్ అభినందించారు.
ఈనాడు దినపత్రిక అధినేతలు చెరుకూరి కిరణ్, శైలజాకిరణ్ దంపతుల కుమార్తె సహారి, అల్లుడు ఎల్లా రామస్ దంపతులు బొల్లినేని కృష్ణయ్యతో ఈ శ్రీ చక్రార్చనలో పాల్గొనడం మరొక విశేషం.
గత నాలుగైదు మాసాలుగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో అమ్మ దర్శనానికి విచ్చేసే వేలకొలది భక్తులకు తాము పవిత్రమైన సుందరమైన ‘సౌభాగ్య’ మంత్రమయ అపూర్వ గ్రంధాన్ని అందించడానికి ప్రధాన కారణభూతులైన కిమ్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య, అపూర్వ రచనలతో లక్షల భక్త పాఠకులను ఆకట్టుకుంటున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌లకు ఈ సందర్భంగా ఈ.ఓ రామారావు కృతజ్ఞతలు తెలపడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి నాలుగు గంటలముందు దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన సమయంలో కూడా భువనేశ్వరి, చంద్రబాబు దంపతులకు వేదాశీర్వచనం చేసేవేళ ఈ పుణ్య గ్రంధాలను దేవస్థాన అడిషనల్ కమీషనర్ కె.ఎస్.రామారావు బహూకరించడం తెలుగుదేశం శ్రేణులను విశేషంగా ఆకర్షించింది.
దేవస్థానం ప్రధానార్చకులు మొదలు విచ్చేస్తున్న ప్రధాన అతిధి భక్తులవరకూ బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం ‘శ్రీమాలిక’ కంటెంట్‌ని, నిస్వార్ధ ధార్మిక సేవనూ అభినందిస్తూనే ఉన్నారు.