Share News

సోలార్‌ ప్లేట్ల చోరీ ముఠా అరెస్ట్‌

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:48 PM

టంగుటూరు, సంతనూతలపాడు మండలాల్లోని పొలాల్లో రైతులు ఏర్పాటుచేసుకొన్న సోలార్‌ ప్లేట్లు, ఇంజన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను టంగుటూరు ఎస్సై నాగేమల్లేశ్వరావు సిబ్బందితో చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు.

సోలార్‌ ప్లేట్ల చోరీ ముఠా అరెస్ట్‌
వివరాలను వెల్లడిస్తున్న సీఐ హజరత్తయ్య, పక్కన టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరావు

నీళ్ల ఇంజన్‌, రూ.85వేల సొత్తు స్వాధీనం

వివరాలను వెల్లడించిన సీఐ హజరత్తయ్య

సింగరాయకొండ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : టంగుటూరు, సంతనూతలపాడు మండలాల్లోని పొలాల్లో రైతులు ఏర్పాటుచేసుకొన్న సోలార్‌ ప్లేట్లు, ఇంజన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను టంగుటూరు ఎస్సై నాగేమల్లేశ్వరావు సిబ్బందితో చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. సోలార్‌ ప్లేట్లు, ఇంజన్లు అమ్మగా వచ్చిన రూ.85 వేల నగదును, ఒక నీళ్ల ఇంజన్‌ను దొంగల నుంచి స్వాధీనం చేసుకొన్నారు. గురువారం సింగరాయకొండ సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ చావా హజరత్తయ్య టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరావుతో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. టంగుటూరు మండ లం మల్లవరపాడు గ్రామానికి చెందిన గౌతుకట్ల అశోక్‌, పొన్నూరి రాంబాబు, పాటిబండ్ల శ్రీకాంత్‌ చెడువ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించారు. తొలుత గత ఏడాది ఫిబ్రవరిలో కందులూరు గ్రామం నుంచి ఎర్రజర్ల వెళ్లేదారిలోని పంటపొలాల్లో 20 సోలార్‌ ప్లేట్లును దొంగిలించారు. ఈ నెల మొదటి వారంలో మల్లవరపాడులోని పెద్దచెరువు దక్షిణం వైపు కట్టమీద ఉన్న నీళ్ల ఇంజన్‌ను అపహరించారు. పది రోజుల క్రితం సంతనూతలపాడు గ్రామంలోని పంట పొలాల్లో 15 సోలార్‌ ప్లేట్లును దొంగలించారు. ఈ క్రమంలో మల్లవరపాడుకి చెందిన రైతు నాగినేని రంగారావు, పైడి శ్రీనివాసులు తమ ఇంజన్‌, సోలార్‌ ప్లేట్స్‌ అపహరణకు గురయ్యాయని టంగుటూరు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆదేశాలతో సీఐ హజరత్తయ్య ఆధర్యంలో ఎస్సై నాగమల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేశారు. ఈక్రమంలో గురువారం టంగుటూరు కొండపి ఫ్లై ఓవర్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీ్‌సస్టేషన్‌కు తరలించి విచారించగా సోలార్‌ ప్లేట్లు, ఇంజన్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. నిదితులను అరె్‌స్టచేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌ తరలించారు. కేసు చేధనలో ప్రతిభ కనబరిచిన ఎస్సై నాగమల్లేశ్వరావు, సిబ్బంది శ్రీనివాస్‌, మహేష్‌, వెంకట్రావు, ఖాదర్‌వలిని సీఐ హజరత్తయ్య అభినందించారు.

Updated Date - Mar 20 , 2025 | 11:48 PM