ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:47 PM
తొలిసారిగా ఒంగోలు నగరం కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర స్థాయి సభలకు వేదిక కానుంది. సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలులో జరగనున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజులపాటు మహాసభలు నిర్వహించాలని ఆపార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.

ఆగస్టు 22 నుంచి 24 వరకు నిర్వహణ
షెడ్యూల్ ఖరారు చేసిన రాష్ట్ర కమిటి
ఒంగోలు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : తొలిసారిగా ఒంగోలు నగరం కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర స్థాయి సభలకు వేదిక కానుంది. సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలులో జరగనున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజులపాటు మహాసభలు నిర్వహించాలని ఆపార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి ప్రజాస్వామ్యబద్దంగా స్థానిక శాఖ నుంచి దేశ స్థాయిలో జాతీయ మహాసభల వరకు కమ్యూనిస్టు పార్టీలు నిర్వహిస్తాయి. ఈ ఏడాది కూడా ప్రధాన కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐలు ఆ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే సీపీఎం జిల్లా, రాష్ట్ర మహాసభలు పూర్తయ్యి వచ్చే నెలలో తమిళనాడులో జాతీయ మహాసభలు నిర్వహించే క్రమంలో ఉండగా సీపీఐ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ప్రారంభమైంది. దేశంలో సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా మహాసభలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఆ మహాసభలు ఈ ఏడాది అక్టోబరులో పంజాబ్ రాజధాని చంఢీఘర్‌లో జరగనున్నాయి. ఆగస్టులోపు రాష్ట్రంలో శాఖల నుంచి జిల్లా, రాష్ట్ర మహాసభల పూర్తి చేయాలని, మూడు రోజుల క్రితం విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్ర మహాసభలను ఈ ఏడాది ఆగస్టు 22నుంచి 24వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మహాసభలకు ఆపార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన, బహిరంగ సభలను కూడా నిర్వహించనున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. ఆమేరకు పార్టీ జిల్లా నాయకత్వానికి రాష్ట్ర కమిటి సమాచారం ఇచ్చింది.