Share News

CPM(GS) Sitaram Yechury:ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు!

ABN , Publish Date - May 10 , 2024 | 06:01 AM

ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ అల్లూరి జిల్లా కూనవరంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు.

CPM(GS) Sitaram Yechury:ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు!

బీజేపీ ఓటమి ఖాయమని మూడు విడతల్లో స్పష్టం

అందుకే మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న మోదీ : ఏచూరి

అమరావతి(ఆంధ్రజ్యోతి), విజయవాడ, కూనవరం, మే 9: ఎన్నికల తర్వాత దేశంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. గురువారం విజయవాడలో విలేకరుల సమావేశంలో, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ అల్లూరి జిల్లా కూనవరంలో నిర్వహించిన బహిరంగ సభలోనూ ఆయన మాట్లాడారు. అవినీతి, అక్రమాన్ని చట్టబద్ధం చేసిన తొలి ప్రధాని మోదీ అని విమర్శించారు.

బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తుందని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని స్పష్టమైందని చెప్పారు. దీంతో ముస్లింలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి, దేశంలో మతోన్మాద ఘర్షణలు రెచ్చగొట్టడం ద్వారా ఎన్నికల్లో గెలవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వామపక్షాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులను కాపాడటానికి ఇది అవసరం, అనివార్యమని పేర్కొన్నారు. ఉత్తర భారతంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి గతంలో కంటే తక్కువ సీట్లే వస్తాయని చెప్పారు. దక్షిణాదిన కూడా కర్ణాటక, మహారాష్ట్రల్లో ఆ పార్టీకి నామమాత్రంగానే సీట్లు వస్తాయన్నారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న రాష్ట్రాల్లోనే ఎన్డీయే కూటమికి కొంచెం ఉనికి చాటుకునే అవకాశం ఉందని తెలిపారు.

బ్లాక్‌మనీ టెంపోల్లో తరలిపోతుంటే ఈడీ, సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అవి రాజకీయ ఏజెన్సీలుగా మారిపోయాయని, ఆ సంస్థలు పాల క పార్టీల కోసమే పని చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఎన్ని ఫిర్యాదులు చేసి నా సీఈసీ కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.

ప్రధాని మోదీ అనుసరిస్తున్న అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతుండగా.. ధనవంతులు అపర కుభేరులుగా అవతరిస్తున్నారని విమర్శించారు. దేశంలో 42 శాతం పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. నల్లధనం లేకుండా చేస్తానని చెప్పిన ప్రధాని.. ఇప్పుడు అదానీ, అంబానీలు కాంగ్రె్‌సకు నల్లధనం ఇస్తున్నారని చెబుతున్నారని, దేశంలో ఇంకా నల్లధనం ఉందని మోదీనే ఒప్పుకొన్నారని విమర్శించారు.

Updated Date - May 10 , 2024 | 06:02 AM