Share News

రఘురామ హత్యకు సీఐడీ కుట్ర

ABN , Publish Date - Nov 28 , 2024 | 03:58 AM

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సీఐడీ కుట్ర చేసిందని పోలీసులు వెల్లడించారు. కస్టడీలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి.. రబ్బర్‌ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీనిపై జూన్‌ 10న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదు...

రఘురామ హత్యకు  సీఐడీ కుట్ర

  • కాళ్లు కట్టేసి రబ్బర్‌ బెల్టు, లాఠీతో చిత్రహింసలు

  • కుట్రలో జగన్‌, సునీల్‌కుమార్‌, పీఎస్‌ఆర్‌ పాత్ర

  • కొడుతున్నప్పుడు వీడియో తీసిందెవరు?

  • ఎవరికి పంపించారో తేలాల్సి ఉంది

  • ప్రాసిక్యూషన్స్‌ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ వెల్లడి

  • 10 వరకు విజయ్‌పాల్‌కు రిమాండ్‌

  • గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు ఆదేశాలు

  • అంతకుముందు ఒంగోలులో సీఐడీ మాజీ ఏఎస్పీకి వైద్య పరీక్షలు

  • భారీ బందోబస్తుతో గుంటూరు తరలింపు

  • 10 రోజులు కస్టడీకి కోరుతూ నేడు కోర్టులో పోలీసుల పిటిషన్‌

గుంటూరు/ఒంగోలు క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సీఐడీ కుట్ర చేసిందని పోలీసులు వెల్లడించారు. కస్టడీలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారని, తాళ్లతో కాళ్లు కట్టేసి.. రబ్బర్‌ బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని తెలిపారు. దీనిపై జూన్‌ 10న గుంటూరు నగరంపాలెం పోలీసు స్టేషన్లో రఘురామ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఏ-1గా నాటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌, ఏ-2గా నాటి నిఘా చీఫ్‌ సీతారామాంజనేయులు, ఏ-3గా అప్పటి సీఎం జగన్మోహన్‌ రెడ్డి, ఏ-4గా అప్పటి సీఐడీ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను, తప్పుడు నివేదిక ఇచ్చిన అప్పటి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ప్రభావతిని ఏ-5గా చేర్చినట్లు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో విజయ్‌పాల్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు బుధవారం ఒంగోలులో వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు నడుమ సాయంత్రం గుంటూరులోని స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో హాజరుపరిచారు.


రఘురామరాజు తరఫున స్పెషల్‌ పీపీ, ప్రాసిక్యూషన్స్‌ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ వీరగంధం రాజేంద్రప్రసాద్‌, విజయ్‌పాల్‌ తరఫున న్యాయవాది ఝాన్సీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఆ కోర్టుకు ఇన్‌చార్జిగా ఉన్న ఎకై్ౖసజ్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ స్పందన.. విజయ్‌పాల్‌కు వచ్చే నెల 10 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలిచ్చారు.

దీంతో ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఆయన నుంచి పలు వివరాలు రాబట్టాల్సి ఉందని.. కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉందని.. పది రోజులు కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ గురువారం పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ప్రాసిక్యూషన్స్‌ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ వీరగంధం రాజేంద్రప్రసాద్‌ ఈ అంశంపై గుంటూరులో మీడియాతో మాట్లాడారు. అరెస్టుకు నెలరోజుల ముందు రఘురామరాజుకు గుండె ఆపరేషన్‌ జరిగిందని తెలిసినా గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించేందుకు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, ఒక బలిష్టమైన వ్యక్తి ఆయన గుండెలపై కూర్చున్నారని చెప్పారు. చివరకు మందులు, మంచినీరు కూడా ఇవ్వలేదన్నారు. ‘ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. చివరకు ఆయన కూర్చున్న మంచం కూడా విరిగిపోయింది. పైగా ఆయన్ను కొడుతున్నప్పుడు ఓ అధికారి సెల్‌ఫోన్లో చిత్రీకరించి ఆ వీడియోను ఎవరికో పంపించారు. ఆ వీడియో తీసిన వ్యక్తి ఎవరు...? ఎవరికి పంపించారనేది విచారణలో తేలుతుంది. ఆ సమయంలో అక్కడకు సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌ వచ్చారు.


అక్కడున్న వారందరినీ బెదిరించి కిందకు పంపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలున్నాయి. సీఐడీ కార్యాలయంలోకి దర్జాగా నడుచుకుంటూ వెళ్లిన రఘురామరాజు.. తిరిగి వచ్చే సమయంలో నడవలేని పరిస్థితుల్లో ఇద్దరి భుజాలపై చేతులు వేసి కాళ్లు ఈడ్చుకుంటూ వచ్చారని ప్రత్యక్ష సాక్షులైన పోలీసు సిబ్బంది చెప్పారు. కొడుతున్న సమయంలో ఆయన బిగ్గరగా కేకలు వేశారని, అవన్నీ తమకు వినిపించాయని కింద కూర్చున్న సిబ్బంది దర్యాప్తులో వెల్లడించారు. ఆయన్ను చిత్రహింసలకు గురిచేసిన సమయంలో అక్కడున్న 29 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని దర్యాప్తు అధికారులు విచారించి వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. సాధారణంగా హత్యాయత్నం కేసులో పదేళ్లు శిక్ష పడుతుంది. కానీ ఈ కేసులో మిగిలిన సెక్షన్ల ప్రకారం నిందితులకు జీవిత ఖైదు తప్పదు. విజయ్‌పాల్‌ను మరింత లోతుగా విచారించాల్సి ఉంది. ఇందుకోసం పది రోజులు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తాం’ అని వివరించారు.

  • విధుల్లో చేరిన చోటే అరెస్టు

గుంటూరు జిల్లాకు చెందిన ఆర్‌.విజయ్‌పాల్‌ 1984లో ఆర్‌ఎ్‌సఐగా ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో చేరారు. నాలుగేళ్లు ఇక్కడే పనిచేశారు. తర్వాత సివిల్‌కు మారి ఇతర జిల్లాలకు వెళ్లారు. సీఐడీ ఏఎస్పీగా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. అయితే ఎక్కడైతే ఉద్యోగంలో చేరారో అదే జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన అరెస్టు కావడం గమనార్హం. జిల్లాలో పనిచేసిన సమయంలో మంచి పోలీసు అధికారిగా గుర్తింపు ఉన్నప్పటికి సీఐడీలో చేరిన తర్వాత పనితీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని వేధించడమే లక్ష్యంగా అనేక మందిపై కేసులు నమోదు చేశారనే విమర్శలు ఉన్నాయి.

Updated Date - Nov 28 , 2024 | 03:58 AM