Share News

Ambati Rambabu: కూటమి గెలుపుపై అనుమానాలను నివృత్తి చేయండి

ABN , Publish Date - Aug 27 , 2024 | 01:14 PM

దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది వైసీపీ వ్యవహారం. ఎన్నికలు జరిగి.. ఫలితాలు వచ్చి.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా రెండు నెలలు దాటుతోంది. ఇప్పుడు కూటమి గెలుపుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ నివృత్తి చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరుతోంది.

Ambati Rambabu: కూటమి గెలుపుపై అనుమానాలను నివృత్తి చేయండి

అమరావతి: దొంగలు పడిన ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది వైసీపీ వ్యవహారం. ఎన్నికలు జరిగి.. ఫలితాలు వచ్చి.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా రెండు నెలలు దాటుతోంది. ఇప్పుడు కూటమి గెలుపుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ నివృత్తి చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరుతోంది. ఈ క్రమంలోనే ఇవాళ సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ బృందం కలిసింది. ఏపీ సీఈఓను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి, మెరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మే 13వ తేదీన ఎన్నికలు జరిగితే.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు. కూటమి గెలుపు తమకు షాక్ ఇచ్చిందని.. మొదట నమ్మలేకపోయామన్నారు. ఓట్ ఫర్ డెమాక్రసీ అనే సంస్థ పోలింగుపై అనుమానాలు వ్యక్తం చేసిందని.. భారత ఎన్నికల సంఘం ఈ అనుమానాలు నివృత్తి చేయాలని కోరామని అంబటి తెలిపారు. ఏ లోపం లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పాల్సిన బాధ్యత ఈసీకి ఉందన్నారు. ఎన్నికలయ్యాక ఏపీలో 68.12 శాతం పోలింగ్ పూర్తి అయిందని ఈసీ చెప్పిందన్నారు. తర్వాత 76.5 శాతానికి పెరిగిందని... ఫైనల్‌గా 80.66 శాతంగా ఈసీ ప్రకటించిందని అంబటి పేర్కొన్నారు.


కౌంటింగ్ సమయంలో 82 శాతం పోలింగ్ జరిగినట్లుగా ఈసీ చెప్పిందని అంబటి తెలిపారు. ఎన్నికల సంఘం ఈ అనుమానాలు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ్టి వరకూ ఫామ్-20 అంటే ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు.. ఎవరికి పోల్ అయ్యాయని చెప్పలేదన్నారు. ఇదొక అసాధారణమైన చర్య అని.. అసలు ఎందుకు ఆలస్యం అయ్యిందని ప్రశ్నించారు. ఫైనల్ ఫిగర్‌కి కౌంటింగ్ ఫిగర్‌కి ఎందుకు తేడా వచ్చిందని అంబటి ప్రశ్నించారు. ఇది అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయని అంబటి తెలిపారు.

Updated Date - Aug 27 , 2024 | 01:14 PM