Share News

సీఎస్‌.. ఇదేం పని?

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:18 AM

అధికార వైసీపీ మరో వంకర ఎత్తుగడకు తెర లేపింది. ‘సుమోటో కుల ధ్రువీకరణ, పరిశీలన’ పేరిట రెవెన్యూ సిబ్బందిని జనంలోకి పంపించాలనే ఆలోచన చేసిన సర్కారు...

సీఎస్‌.. ఇదేం పని?

జగన్‌ రెడ్డి కోసం ‘పట్టా’లు తప్పిన జవహర్‌ రెడ్డి

‘పేదలందరికీ ఇళ్ల పట్టాలు’... అని రెండేళ్లుగా రాగాలు తీస్తూనే ఉన్నారు!

పేదలకు కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వకుండా సర్కారును ఎవరూ అడ్డుకోలేదు!

రెండు నెలల కిందట ఇవ్వొచ్చు! ఎన్నికల షెడ్యూలుకు ముందే ఇచ్చి ఉండొచ్చు!

ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వమూ ఇవ్వొచ్చు! కానీ... సరిగ్గా ఇప్పుడే, ఎన్నికల ముందే

పట్టాలు ఇచ్చేస్తారట! ఏకంగా 21 లక్షల పట్టాలు జారీ చేసేస్తారట!

ఇది... ఎన్నికల ఎత్తుగడ కాదా? ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం కాదా!?

సరిగ్గా ఎన్నికల ముందే పట్టాల నాటకం

రెండేళ్ల కిందటే పేదల ఇళ్ల కోసం భూసేకరణ

ఆ పేరుతో కోట్లు నొక్కేసిన వైసీపీ నేతలు

ఇన్నాళ్లుగా 8 లక్షల మందికి మాత్రమే పట్టాలు

ఆ తర్వాత అటకెక్కించిన జగన్‌ సర్కారు

ఎన్నికల ముందు మళ్లీ తెరపైకి

సీఎంవో ఒత్తిడి, సీఎస్‌ హుకుంతో రెవెన్యూ ఫైలు

పాత పథకమే అంటూ అమలుకు స్ర్కీనింగ్‌ కమిటీ

అన్నీ తెలిసీ జవహర్‌ రెడ్డి నేతృత్వంలోనే ఆమోదం!?

సుమోటో కుల ధ్రువీకరణపై వెనకడుగు కోడ్‌ ఉల్లంఘన అవుతుందని తగ్గిన జగన్‌ సర్కారు

ఎన్నికల తర్వాతే అమలు.. కలెక్టర్లు, జేసీలకు ఆదేశం

(అమరావతి - ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీ మరో వంకర ఎత్తుగడకు తెర లేపింది. ‘సుమోటో కుల ధ్రువీకరణ, పరిశీలన’ పేరిట రెవెన్యూ సిబ్బందిని జనంలోకి పంపించాలనే ఆలోచన చేసిన సర్కారు.. ఇప్పుడు ఇళ్ల పట్టాల పేరుతో కొత్త నాటకం మొదలుపెట్టింది. 21 లక్షల మంది లబ్ధిదారులకు జగన్‌ బొమ్మలు ముద్రించిన ఇంటి పట్టాలను ‘కన్వేయెన్స్‌ డీడ్‌’ల రూపంలో పంచాలని యోచిస్తోంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఇలా చేయకూడదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి స్వయంగా ఈ తతంగం నడిపిస్తున్నట్లు సమాచారం! ఒకవైపు సీఎస్‌ హోదాలో ఎన్నికల కోడ్‌ అమలుపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తూనే... మరోవైపు జగన్‌కు లబ్ధిచేకూర్చేలా ‘పట్టా’లు తప్పుతుండటంపై అధికార యంత్రాంగంలోనే విస్మయం వ్యక్తమవుతోంది. ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ స్కీమ్‌ కింద 30 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలను కన్వేయెన్స్‌ డీడ్‌ల రూపంలో ఇవ్వాలని జగన్‌ సర్కారు రెండేళ్ల కిందటే నిర్ణయించింది. లబ్ధిదారుల జాబితానూ సిద్ధం చేసింది. ఆ జాబితా నిజమైనదా, కాదా అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటి వరకు 8 లక్షల మంది పేదలకు జగన్‌ ఫొటో, నవరత్నాల లోగోలు ముద్రించి ఉన్న ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. నిజానికి పేదల ఇంటి స్థలాలకు భూసేకరణ 2022లోనే ముగిసిపోయింది. ఈ పేరుతో వైసీపీ నేతలు కోట్లు దండుకున్నారు. జగన్‌ సర్కారుకు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే... ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే పట్టాలు పంపిణీ చేసేవాళ్లు. కానీ... పేదలకు ముందుగానే ఇంటి పట్టాలు ఇచ్చేస్తే ఆ తర్వాత మరచిపోతారనుకున్నారో ఏమో వాటిని పక్కన పెట్టేశారు. సరిగ్గా ఇప్పుడు... ఎన్నికల సమయంలో ‘పథకాన్ని’ బయటికి తీశారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ... ఇలా కీలక విభాగాల అధికారులతో టీమ్‌లను ఏర్పాటు చేసి, వారిని లబ్ధిదారుల వద్దకు పంపించి ‘జగనన్న పట్టా’ల పేరుతో హడావుడి చేయాలని వంకర వ్యూహం రచించారు.

ఎన్నికల స్టంట్‌...

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో పట్టాల పంపిణీ చేపట్టడం కుదరదు. కానీ... ఇది కొత్త పథకం కాదని, పాత దానికే కొనసాగింపు అని వాదిస్తూ ఈసీ అనుమతితో పట్టాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కానీ, ఈ వాదన ఎంతమాత్రం చెల్లదు. ఇది ప్రతి నెలా పెన్షన్‌ ఇవ్వడం లాంటిది కాదు. దీనిపై ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ... పట్టాల పంపిణీ అలా కాదు. భూసేకరణ, లబ్ధిదారుల జాబితా ఎప్పుడో పూర్తయినా... పట్టాలను మాత్రం ఆపేసి, వాటిని ఎన్నికల ముందు ఇస్తామనడమే అసలు సమస్య! ఇది ఓటర్లను ప్రభావితం చేయడమే. ఈ విషయం అధికారులందరికీ తెలుసు. ఇందుకు ఈసీ అంగీకరించదనీ తెలుసు. అందుకే... ‘స్ర్కీనింగ్‌ కమిటీ’ని తెరపైకి తెచ్చారు. సీఎస్‌ నేతృత్వంలో ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు, సంయుక్త కార్యదర్శి సభ్యుడిగా ఈ కమిటీ ఏర్పడింది. ‘ఇది పాత పథకమే. ఇప్పుడు పట్టాలు ఇవ్వొచ్చు’ అని స్ర్కీనింగ్‌ కమిటీతో ఆమోదం పొంది, తర్వాత ఈసీ క్లియరెన్స్‌ పొందాలన్నది వీరి వ్యూహం.

రంగంలోకి సీఎంవో

పట్టాల పంపిణీ కోసం నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగినట్లు తెలిసింది. రెవెన్యూశాఖ నుంచి ఇంటి పట్టాల పంపిణీ ఫైలు తెప్పించుకోవాలని సీఎ్‌సపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ ఫైలును స్ర్కీనింగ్‌ కమిటీ ఆమోదం కోసం పంపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేకప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌పై కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. చివరగా ఈ ఫైలు పంపించాలని సీఎస్‌ నేరుగా రెవెన్యూ శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఆ తర్వాతే రెవెన్యూ శాఖ సదరు ఫైలును స్ర్కీనింగ్‌ కమిటీకి పంపించింది. శుక్రవారం ఉదయం సచివాలయంలో సీఎస్‌ జవహర్‌ రెడ్డి నేతృత్వాన కమిటీ భేటీ జరిగింది. ఇందులో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజైయ్‌జైన్‌తోపాటు, మరో కీలక అధికారి కూడా పాల్గొన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధం, కోడ్‌ సమయంలో కుదరదని తెలిసినా... దీనిని ముందు నుంచే అమలవుతున్న పథకంగా చెబుతూ అనుమతి కోసం ఈసీకి లేఖ రాయడంపై చర్చించారు. దీనిపై సుదీర్ఘ నోట్‌ తెప్పించుకొని చర్చించినట్లు తెలిసింది.

దీన్నేమంటారు సీఎస్‌?

ఎన్నికల కోడ్‌ వచ్చాక రహదారులపై ఉన్న విగ్రహాలకు ముసుగులు వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పత్రాల్లో నేతల ఫొటోలను తొలగించారు. పేర్లు, ఫొటోలు చూపించి ఓటర్లను ప్రభావితం చేయకూడదనే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. అలాంటిది... ఏకంగా జగన్‌ ఫొటోలున్న పట్టాల పంపిణీకి కోడ్‌ వర్తించదా? అసలు... రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన పట్టాలను సరిగ్గా ఎన్నికల ముందు ఇవ్వడం కుదురుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం సీఎ్‌సకు తెలియనిది కాదు. అయినా సరే... ఆయన ‘పట్టాలు’ తప్పారంటే, అది జగన్‌ కోసమే అని చెప్పక తప్పదు. ఇప్పటికే సీఎస్‌ జవహర్‌ రెడ్డి తీరుపై విపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. ఆయనను పక్కకు తప్పిస్తేనే ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని చెబుతున్నాయి. ‘మీరు చెప్పింది నిజమే. నేను జగన్‌ పక్షపాతినే’ అని స్వయంగా జవహర్‌ రెడ్డి చాటి చెప్పుకోవడమే కొసమెరుపు!

Updated Date - Apr 13 , 2024 | 04:18 AM