Share News

Pawan Kalyan: పెన్షన్ల పంపిణీపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ABN , Publish Date - Aug 01 , 2024 | 05:46 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. పంపిణీ దాదాపు పూర్తి కావొచ్చింది. పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: పెన్షన్ల పంపిణీపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. పంపిణీ దాదాపు పూర్తి కావొచ్చింది. పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లను రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశామని అన్నారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని ఇవాళ (గురువారం) ఉదయం నుంచి ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించారని చెప్పారు.


పేదల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూపొందించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రజలకు చేరువైందని వ్యాఖ్యానించారు. అందరూ హర్షించేలా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు అని అన్నారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసినా సంక్షేమ పథకాల అమలుకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాకు ఆయన స్పందించారు.


స్వప్నిల్ కుశాలెకు అభినందనలు

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన షూటర్ స్విప్నల్ కుశాలెకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినంందనలు తెలిపారు. ‘‘ మన దేశానికి మరో పతకం దక్కడం సంతోషాన్ని కలిగించింది. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో కాంస్యం సాధించిన యువ షూటర్ స్వప్నిల్ కుశాలెకు హృదయపూర్వక అభినందనలు. ఈ ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.


పెన్షన్ పంపిణీ మంత్రి లోకేశ్ హర్హం

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వేకువజామునే మొదలైంది. ఎమ్మెల్యేలు, అధికారులు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. విజయవంతంగా పెన్షన్ల పంపిణీపై విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకటో తేదీన తెల్లవారి 6 గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే తమ కూటమి ప్రభుత్వానికి దీవెనలు అని అన్నారు. పింఛన్లు అందుకున్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే తమకు ఆశీస్సులు అని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాదిమంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి అందిన వెలకట్టలేని బహుమానమని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.


కూటమి ప్రభుత్వం... ప్రజా సంక్షేమ ప్రభుత్వం: నాగబాబు

కూటమి ప్రభుత్వం... ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని జనసేన నేత నాగబాబు అన్నారు. సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు చేస్తామని ఆయన చెప్పారు. పిఠాపురంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నాగబాబు, పీ.హరిప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికీ స్వయంగా వెళ్లి నాగబాబు పెన్షన్లు అందజేశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వెల్లడించింది.

Updated Date - Aug 01 , 2024 | 06:22 PM