Share News

Hyderabad: పోస్టల్‌ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!

ABN , Publish Date - Apr 06 , 2025 | 05:56 AM

మహిళా సమృద్ధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేద మహిళలకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున పోస్టాఫీసు ఖాతాలో జమ చేస్తుంది.

Hyderabad: పోస్టల్‌ ఖాతాలో నెలకు రూ.2500 వేస్తారట..!
Govt Scheme for Women

  • కేంద్ర ప్రభుత్వ పథకమంటూ ప్రచారం

  • ఆబిడ్స్‌ పోస్టాఫీసుకు పోటెత్తుతున్న మహిళలు

  • 12 రోజుల్లో 2500 ఐపీపీబీ ఖాతాలు ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): మహిళా సమృద్ధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేద మహిళలకు ప్రతి నెలా రూ.2,500 చొప్పున పోస్టాఫీసు ఖాతాలో జమ చేస్తుంది. ఇందుకోసం పోస్టాఫీసులో సేవింగ్స్‌ ఖాతా ఉంటే చాలట..!! ఎలా మొదలైందో ? ఎక్కడ మొదలైందో ? తెలియదు కానీ.. ఈ ప్రచారం హైదరాబాద్‌ గల్లీల్లో కొద్ది రోజులుగా జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నమ్మిన హైదరాబాద్‌ మహిళలు.. ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) ఖాతా తెరిచేందుకు ఆబిడ్స్‌లోని జనరల్‌ పోస్టాఫీసు(జీపీవో)కు కొద్దిరోజులుగా పోటెత్తుతున్నారు.


ఐపీపీబీ ఖాతాలు తెరిచేందుకు వచ్చే వారి కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా, మార్చి 24 నుంచి శనివారం దాకా 12 రోజుల వ్యవధిలో 2500 మంది మహిళలు ఐపీపీబీ ఖాతాలు తెరిచారు. ఇది వరకు రోజుకు ఐదు లేదా ఆరు ఐపీపీబీ ఖాతాలు మాత్రమే తెరిచేవారమని, ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 200 దాటుతుందని పోస్టల్‌ సిబ్బంది చెబుతున్నారు. అయితే, మహిళలకు నెలకు రూ.2,500 పథకంపై సంబంధిత అధికారులు ఎవరైనా స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 06 , 2025 | 07:00 AM