Share News

AP News: వాగులో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - Jul 18 , 2024 | 06:26 PM

జిల్లాలోని వేలేరుపాడు మండలం అల్లూరి నగర్- మాధారం మధ్య కొడిసేలా వాగు ప్రవాహంలో కారు కొట్టుకు పోయింది. కారులో అయిదుగురు ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

AP News: వాగులో కొట్టుకుపోయిన కారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

ఏలూరు: రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతుండటంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఏపీలో పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణం కేంద్రం అధికారులు తెలిపారు. ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది. ఏలూరు, అల్లూరి జిల్లా, కొనసీమ, వేస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తాయి. కృష్ణ ఎన్టీఆర్ అనకాపల్లి విశాఖ విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయి. పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.


అయితే భారీ వర్షాలతో జిల్లాలోని వేలేరుపాడు మండలం అల్లూరి నగర్- మాధారం మధ్య కొడిసేలా వాగు ప్రవాహంలో కారు కొట్టుకు పోయింది. కారులో అయిదుగురు ఉన్నట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన వారిలో శింగవరపు జ్యోతి(50), గడ్డం సాయి కుమారి(30), గడ్డం కుందనకుమార్ (11), గడ్డం జగదీష్ కుమార్ (08) రామారావు, డ్రైవర్ ఉన్నారు. రాజమండ్రి నుంచి వేలేరుపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతయిన వారిలో శింగవరపు జ్యోతి, డ్రైవర్ రామారావుల స్వస్థలం రాజమండ్రి. సాయికుమారి, ఆమె ఇద్ధరు కొడుకులు వేలేరుపాడు మండలం రుద్రంకోటకు చెందిన వారిగా గుర్తించారు.ఏలూరు జిల్లాలో వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనపై సహాయ చర్యలకు ప్రభుత్వం దిగింది.


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు జిల్లా కలెక్టర్,ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులతో సీఎం కార్యాలయ అధికారులు మాట్లాడారు. ఘటన జరిగిన ప్రాంతానికి సహాయక బృందాలను తక్షణమే పంపి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడాలని ఆదేశాలు జారీ చేశారు. హెలికాఫ్టర్ తెప్పించి ప్రమాదంలో ఉన్న కుటుంబాన్ని కాపాడాలని ఆదేశించారు.

కాగా.. ఏలూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. వరదల సహాయ చర్యల నిమిత్తం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అత్యవసర సమాచారం కోసం ప్రజలు టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 233 1077లో సంప్రదించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.


కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద కొండ వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నంది. జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలె వద్ద ఉదృతంగా జల్లేరు వాగు పారుతోంది. సుమారు 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్ర కాలువ ప్రాజెక్టుకు వరద నీరు పెరిగింది. ప్రాజెక్టు నాలుగు గేట్లలో రెండు గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల వరద నీరు దిగువకు అధికారులు విడుదల చేశారు.

Updated Date - Jul 18 , 2024 | 06:26 PM