PM Modi: జగన్ మళ్లీ గెలవరు!
ABN , Publish Date - May 12 , 2024 | 04:20 AM
సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆయన్ను ఎప్పుడూ మిత్రుడిగా భావించలేదు
ఏనాడూ మేం కలిసి పోటీ చేయలేదు
ఏపీలో ఎన్డీయేదే ప్రభుత్వం: ప్రధాని
మా ర్యాలీలు, రోడ్‌షోలకు అపూర్వ స్పందన
న్యూఢిల్లీ, మే 11: సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయతే కొన్ని అంశాలపై పార్లమెంటులో వైసీపీ ఎంపీలు మద్దతిచ్చిన మాట నిజమన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేస్తున్నాయని.. జనసేన కూడా తమతో ఉందని తెలిపారు. మా ర్యాలీలు, రోడ్‌షోలకు వచ్చిన జనస్పందన చూశాక.. ఎన్డీయే ఆంధ్రలో మెజారిటీ లోక్‌సభ సీట్లు గెలుచుకోవడమే కాదు.. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్మకంగా చెప్పగలను’ అని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. ప్రస్తుత జగన్ సర్కారు తిరిగి ఎన్నికవుతుందని తాను అనుకోవడం లేదన్నారు. ‘గతంలో జరిగిన ఎన్నికల్లో మేం ప్రత్యర్థులుగా పోరాడాం. ఎప్పుడూ మిత్రులుగా కలిసి పోటీచేయలేదు. రాజకీయ యవనికపై చెరోవైపు ఉన్నాం. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఎవరు అధికారంలో ఉన్నారన్న విషయంతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలను బలోపేతం చేయాల్సిన బాధ్యత నాది. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికీ నేను కట్టుబడి ఉన్నాను. అది నా రాజ్యాంగ కర్తవ్యం’ అని వెల్లడించారు. భావసారూప్య ప్రాంతీయ పార్టీలతో కలిసి సాగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. తాము ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలను గౌరవించి నెరవేర్చాల్సి ఉందన్నారు.
తెలంగాణలోనూ క్లీన్ స్వీప్..
ఆంధ్రలోనే గాక తెలంగాణలోనూ బీజేపీకి సానుకూల పరిస్థితి ఉందని.. ఆ రాష్ట్రంలోనూ ఈ సారి క్లీన్‌స్వీప్ చేస్తామని ప్రధాని అన్నారు.