AP Politics: నాడు -నేడు.. మారిన సీను
ABN , Publish Date - Apr 26 , 2024 | 05:16 AM
పులివెందుల అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
2019లో అమ్మ ముద్దు...వెంట వివేకా బామ్మర్ది
ఈసారి జగన్ నామినేషన్‌లో కనిపించని ఆ దృశ్యాలు
నామినేషన్‌కు ముందు అప్పుడూ ఇప్పుడూ సభ
అప్పట్లో భారీగా తరలొచ్చిన వివేకా అభిమానులు
వివేకా హత్యలో నిజాలు బయటకు వచ్చిన నేపథ్యంలో గురువారం సభలో కనిపించని అప్పటి ఊపు
ఇప్పటికే అమెరికా వెళ్లిపోయిన తల్లి విజయలక్ష్మి
అవినాశ్ ఇచ్చిన పెన్నుతో పత్రాలపై సంతకం
అమరావతి, పులివెందుల, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : పులివెందుల అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ జగన్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన 2019లో ఇక్కడకు నామినేషన్ వేయడానికి వచ్చారు. అయితే, అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితిలో చాలా తేడా కనిపించింది. గత ఐదేళ్ల కాలంలో జగన్ వైఖరిలో, ఆయన కుటుంబ సభ్యుల తీరులో వచ్చిన మార్పు ఆయన పులివెందుల పర్యటనలో స్పష్టంగా కనిపించింది. జగన్ 2019 ఎన్నికల్లో నామినేషన్ సందర్భంగా పులివెందులలోని సీఎ్‌సఐ వద్ద నిర్వహించిన బహిరంగసభకు జనం పోటెత్తారు. ఆ రోడ్డంతా ఎటు చూసినా జనం కనిపించారు. వైసీపీ కార్యకర్తలు, జనం భారీగా వచ్చారు. అప్పటికి కొద్ది రోజుల ముందే వివేకా హత్య జరగడంతో వివేకా అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అయితే ఐదేళ్ల తరువాత గురువారం జగన్ నామినేషన్ వేసిన సందర్భంగా పులివెందులలో నిర్వహించిన బహిరంగసభ చూస్తే.. గతానికి ఇప్పటికీ చాలా తేడా కనిపించింది. గురువారం బహిరంగసభను అదే సీఎ్‌సఐ స్కూలులో నిర్వహించారు. బహిరంగసభ కోసం భారీగా వైసీపీ నేతలు జన సమీకరణ చేపట్టారు. ఇంత చేసినా బహిరంగసభకు 2వేలనుంచి 3వేల మధ్య జనం హాజరయ్యారని చెబుతున్నారు. 2019లో నామినేషన్ సమయానికి ఇప్పటికి చూస్తే చాలా తేడా ఉంది. అప్పట్లో వివేకా హత్య అంశం ప్రధానం కావడంతో వైసీపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు వివేకా హత్య కేసు గుట్టురట్టు కావడం.. సీబీఐ ఎంపీ అవినాశ్, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిలను నిందితులుగా చేర్చడం, వారిని జగన్ వెనకేసుకుని రావడం కూడా.. జనం పెద్దగా రాకపోవడానికి కారణమని అంటున్నారు.
2019లో అలా... 2019 ఎన్నికల సమయంలో జగన్ నామినేషన్ వేసిన రోజున ఆయన వెంట తల్లి విజయలక్ష్మి పులివెందులకు వచ్చారు. నామినేషన్ వేయడానికి వెళ్లేముందు ఆమె జగన్‌కు ముద్దుపెట్టి ఆశీర్వదించారు. నామినేషన్ సమయంలో ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి ఉన్నారు.
గురువారం ఇలా... గురువారం పులివెందులలో జగన్ నామినేషన్ వేశారు. అయితే, ఈ కార్యక్రమానికి తల్లి విజయలక్ష్మి హాజరుకాలేదు. ఆమె ఇప్పటికే అమెరికా వెళ్లిపోయారు. అప్పట్లో నామినేషన్ వేసినప్పుడు ఉన్నవారిలో వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి ఈసారి దూరంగా ఉన్నారు. జగన్ వెంట ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి మాత్రమే కనిపించారు. అవినాశ్‌రెడ్డి పెన్ను తీసి ఇవ్వగా, నామినేషన్ పత్రాలపై జగన్ సంతకాలు చేశారు.