Minister Atchannaidu: రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 04 , 2024 | 03:07 PM
అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హామీ ఇచ్చారు.
అమరావతి: అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) హామీ ఇచ్చారు. ఆదివారం నాడు ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అధికారులకు మంత్రి అచ్చెన్న కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణీ చేశామని తెలిపారు.
విత్తన పంపిణీపై తక్షణ అమలుకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. అధిక వర్షపాతం నమోదు కావడంతో వరి పంటలు పాడయ్యాయని చెప్పారు. ఇప్పటికే వరి ఊడ్పుల కోసం సిద్ధంగా ఉన్న సుమారు 1406 హెక్టార్ల నారుమళ్లు, 33వేల హెక్టార్లలో నాట్లు పూర్తయిన వరి పంట ముంపునకు గురైందని చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా సుమారు 6356 క్వింటాళ్ల వరి విత్తనాలను తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాలో గల ప్రతి రైతు సేవా కేంద్రాల వద్ద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా పంపిణీ చేయటానికి సిద్ధం చేశామని అన్నారు. అధిక వర్షాలతో నారుమళ్లు, నాటిన వరి పంటలు దెబ్బ తిన్న రైతులు 80% రాయితీపై తమ తమ గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాల ద్వారా తీసుకోవచ్చని వెల్లడించారు. మంచి సాగు యాజమాన్య పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించాలని అచ్చెన్నా యుడు కోరారు.
వైసీపీ హయాంలో అభివృద్ధి జరగలేదు: ఆనం రామనారాయణ రెడ్డి
నెల్లూరు: ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లోని జలాశయాలు నిండు కుండలా మారాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు. ఆదివారం నాడు ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. నదుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సోమశిల జలాశయం ఆపరాన్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతామని అన్నారు. గత పదేళ్లుగా మేకపాటి కుటుంబం నిర్లక్ష్యంతో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 12.80 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఆత్మకూరులో బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేశామని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆత్మకూరు మున్సిపాలిటీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో భూకుంభకోణాలు: దేవినేని ఉమామహేశ్వర రావు
అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు (
Devineni Umamaheswara Rao) తెలిపారు. మూడు గంటల పాటు నిలబడే వేల వినతుల స్వీకరించారని అన్నారు. ఆదివారం నాడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హయాంలో అడుగడుగునా భూ కుంభకోణాలతో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించారని ఆరోపించారు. భూ ఆక్రమణలపైన ఉక్కుపాదం మోపడమే కాదు... అస్తవ్యస్తమైన రెవెన్యూ రికార్డులను కఠిన చర్యల ద్వారా ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. 100 రోజుల్లో వ్యవస్థలను గాడిలో పెట్టి అభివృద్ధిలో ఏపీని మళ్లీ అగ్రగామిగా నిలిపేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు.