Share News

పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - Nov 18 , 2024 | 01:14 AM

బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరం పర్యాటకులు, భక్తులతో పోటెత్తింది. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు బాపట్ల నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.

పోటెత్తిన భక్తజనం
సూర్యలంక సముద్రతీరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తజనం

సూర్యలంక సముద్ర తీరం కిటకిట

పౌర్ణమి కంటే ఎక్కువగా తరలివచ్చిన జనం

180 మంది పోలీసుల బందోబస్తు.. మరబోట్లు, డ్రోన్లతో గస్తీ

బాపట్ల, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరం పర్యాటకులు, భక్తులతో పోటెత్తింది. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు బాపట్ల నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిన భక్తుల పుణ్యస్నానాలతో సముద్రతీరం పులకరించింది. కార్తీక పౌర్ణమి రోజు కంటే ఎక్కువ మంది భక్తులు తరలిరావడంతో తీరం కిక్కిరిసిపోయింది. దీంతో 180 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గజ ఈతగాళ్లతో, సముద్రజలాల్లో మరబోట్లపై గస్తీ, డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. స్నానాలు ఆచరిస్తున్న వారిని లోతుకు వెళ్ళనీయకుండా అప్రమత్తం చేస్తూ మైక్‌లో పోలీసు సిబ్బంది సూచనలు చేశారు. అలల తాకిడికి కొట్టుకుపోతున్న వారిని కాపాడారు. డీఎస్పీ రామాంజనేయులు, సీఐలు గంగాధర్‌, హరికృష్ణ, మెరైన్‌ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, శ్రీనువాసులు, ఏఎస్‌ఐ అమరేశ్వరరావు తదితరులు భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 01:14 AM