Share News

YSRCP: వైసీపీ నేతలు ఇక మారరా.. అసత్య ప్రచారాల్లో అగ్రస్థానం

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:25 PM

విశాఖపట్టణానికి బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ షిప్‌లో భారీగా డ్రగ్స్ ఉన్నాయని, వాటి విలువ వేల కోట్లు ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అప్పట్లో రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ప్రజలు సైతం డ్రగ్స్ దిగుమతి జరిగి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు..

YSRCP: వైసీపీ నేతలు ఇక మారరా.. అసత్య ప్రచారాల్లో అగ్రస్థానం
YS Jagan

వైసీపీకి ప్రజలు ఎన్నికల్లో తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పినా.. నేతల్లో మార్పు మాత్రం కనిపించడంలేదనే చర్చ జరుగుతోంది. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువైందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని ఓడరేవుల ద్వారా విదేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి జరుగుతోందని, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. విశాఖపట్టణానికి బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ షిప్‌లో భారీగా డ్రగ్స్ ఉన్నాయని, వాటి విలువ వేల కోట్లు ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అప్పట్లో రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ప్రజలు సైతం డ్రగ్స్ దిగుమతి జరిగి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు లేవనెత్తాయి. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించారు.


తాజాగా ఆ కంటైనర్ షిప్‌లో ఎలాంటి డ్రగ్స్ లేవని సీబీఐ వర్గాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో గతంలో అబద్ధాలు చెప్పారని, షిప్‌లో డ్రగ్స్ లేవని, తాము శుద్ధపూసలమంటూ వైసీపీ నేతలు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని పరిస్థితుల ఆధారంగా భారీ కంటైనర్ విదేశాల నుంచి రావడంతో డ్రగ్స్ ఉండిఉండొచ్చనే అనుమానం వ్యక్తమైంది. అప్పట్లో ఏ గ్రామంలో చూసినా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరికేవి. నేరాలు ఎక్కువుగా జరిగేవనే ఆరోపణలు ఉన్నాయి. కంటైనర్‌లో డ్రగ్స్‌తో సంబంధం లేకుండానే ఓటర్లు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. వాస్తవానికి ఐదేళ్ల పాలనను చూసి ప్రజలు తమ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. డ్రగ్స్, గంజాయి వినియోగం రాష్ట్రంలో ఎలా ఉండేది, దీంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళన నేపథ్యంలో ఓటరు ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలో స్పష్టమైన తీర్పు చెప్పారు. డ్రగ్స్, గంజాయి వ్యాపారంలో వైసీపీ నేతల ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది.


ప్రజల తీర్పును అపహస్యం చేసేలా వైసీపీ..

ఏదైనా ఒక అసత్య ప్రచారాన్ని నమ్మి ప్రజలు గంపగుత్తగా ఓట్లు వేసే అవకాశం ఉండదు. ఐదేళ్ల ప్రభుత్వ పనితీరును గమనించి దాని ఆధారంగా తమ తీర్పునిస్తారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేలా ఉంటే ప్రజల తీర్పును శిరస్సావహిస్తున్నామని చెప్పి, వారి మద్దతు వచ్చే ఎన్నికల్లో కూడగట్టేందుకు ప్రయత్నం చేయాలని, దానిని వదిలేసి ఏదో ఒక అంశం ఆధారంగా తాము ఓడిపోయామని మాట్లాడటం ద్వారా ప్రజాతీర్పును అవమానించడమే అవుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. అసత్య ప్రచారాలు చేయడంలో ముందుండే వైసీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని కూటమి నేతలు అంటున్నారు. కంటైనర్‌లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో విచారణ చేశారని, డ్రగ్స్ లేవని సీబీఐ విచారణలో తేలిందే తప్ప.. దీంతో తాము ఏదో సాధించామనే రీతిలో వైసీపీ నేతలు హడావుడి చేయడం సరికాదని కూటమి నేతలు హితవు పలుకుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 09 , 2024 | 04:25 PM