Share News

మా పోస్టులు రెవెన్యూ వాళ్లకా..?

ABN , Publish Date - Dec 08 , 2024 | 04:03 AM

గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ జీవో ఆరోగ్య శాఖలో చిచ్చుపెడుతోంది.

మా పోస్టులు రెవెన్యూ వాళ్లకా..?

ఆరోగ్యశాఖలో గ్రూప్‌-1 కేడర్‌ అధికారుల తీవ్ర ఆవేదన

వైసీపీ ప్రభుత్వ జీవో.. కూటమి హయాంలో అమలు

ఆస్పత్రుల్లో పోస్టుల పెంపు కోసం జీవో 178

అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల్లో రెవెన్యూ అధికారులకు ప్రాధాన్యం

అసలే పదోన్నతులు లేక ఆరోగ్యశాఖలో నైరాశ్యం

ఇప్పుడు రెవెన్యూ అధికారుల రాకతో రేగిన చిచ్చు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

త వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ జీవో ఆరోగ్య శాఖలో చిచ్చుపెడుతోంది. ఆ శాఖలో కొత్త పోస్టులు సృష్టించడానికి 2023 అక్టోబరు 17న జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన జీవో 178 అమలుతో ఆరోగ్యశాఖ అధికారు లు వర్సెస్‌ రెవెన్యూ శాఖ అధికారులు అన్నట్లు పరిస్థి తి మారింది. అప్పటి జీవోను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అమలు చేయ డం దీనికి కారణం. ఆరోగ్యశాఖ పరిధిలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటి కోసం వైసీపీ హయాంలో 11 అడ్మినిస్ట్రేటర్స్‌ పోస్టులు సృష్టించారు. వారి అర్హతల ను జీవో 178లో పొందుపరిచారు. అడ్మినిస్ట్రేటర్‌ పోస్టు లో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి లేదా జాయింట్‌ డైరెక్టర్‌ కేడర్‌ అధికారులను నియమించవచ్చని, వారికి 50 ఏళ్లలోపు ఉండాలనే నిబంధన పెట్టా రు. వైసీపీ హయాంలో తీసుకున్న ఈ నిర్ణయం అప్ప ట్లో సంచలనం అయింది. బోధనాసుపత్రుల్లో అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల్లో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు ఎందుకని ప్రశ్నలు ఉదయించాయి. గ్రూప్‌-1 ద్వారా మెరిట్‌లో ఉద్యోగం సంపాదించి అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ కేడర్‌లోనే ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న అధికారులు ఆరోగ్యశాఖలో చాలా మంది ఉన్నారు. శాఖలో కొత్తగా అడ్మినిస్ట్రేటర్‌ పోస్టులు అనగానే అవి తమకే వస్తాయని వారంతా ఆనందపడ్డారు. కానీ నిబంధనలు చూశాక వారి ఆశలు అడియాశలు అయ్యాయి. దీంతో ఆ జీవో వచ్చినప్పటి నుంచి దానిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు.


మేమూ అడ్మినిస్ట్రేటర్లమే..

వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ దానిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. 11 పోస్టుల్లో కేవలం నాలుగింటిని మాత్రమే భర్తీ చేశారు. అందులో ఒక రెవెన్యూ అధికారి విధుల్లో చేరకముందే పోస్టు తనకు వద్దని వెళ్లిపోయారు. అయితే ఆ జీవోను కూటమి ప్రభుత్వంలో నిక్కచ్చిగా అమలు చేస్తున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ బదిలీల్లో భాగంగా ఆర్డీవో స్థాయి అధికారులు ఏడుగురిని ఆరోగ్య శాఖకు పంపారు. దీనిపై ఆరోగ్యశాఖలోని గ్రూప్‌-1 కేడర్‌ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులు లేక ఏళ్ల తరబడి ఒకే కేడర్‌లో పనిచేస్తున్న తమను కాదని రెవెన్యూ అధికారులకు పోస్టింగ్స్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబుకు అనేకసార్లు విన్నవించినా ఫలితం లేదు. దీంతో తమ ఆవేదనను తెలియజేస్తూ ఆరోగ్య శాఖలోని గ్రూప్‌-1 అధికారులంతా ఆ శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. తామూ అడ్మినిస్ట్రేటర్లమే అని, తమ శాఖలోని అడ్మినిస్ట్రేటర్‌ పోస్టులు తమకే కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.

గ్రూప్‌ 1 పోస్టుల్లో గ్రూప్‌ 2 అధికారులా?

ప్రస్తుతం ఆరోగ్యశాఖలో పదోన్నతులు లేక అధికారుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. ఆ శాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లంతా గ్రూప్‌-1లో మెరిట్‌ ఆధారంగా ఎంపికైన వారు. డిప్యూటీ డైరెక్టర్లు, జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టులు తక్కువ ఉండడం వల్లనే పదోన్నతుల్లో కదలిక లేదు. డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులు 11 ఉన్నప్పటికి నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో పోగ్రామ్‌ ఆఫీసర్లు, నోడల్‌ ఆఫీసర్‌ కేడర్‌లో18 మంది డిడిలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్‌హెచ్‌ఎం పోస్టులను జాయింట్‌ డైరెక్టర్‌ కేడర్‌ పోస్టులుగా మార్చాలనే డిమాండ్‌ ఉంది. అలానే బోధనాసుపత్రుల్లో కొత్తగా సృష్టించిన అడ్మినిస్ట్రేటర్ల పోస్టులను కూడా జాయింట్‌ డైరెక్టర్‌ కేడర్‌ పోస్టులుగా మారిస్తే ఆరోగ్యశాఖలో చాలా మంది డిడిలకు పదోన్నతులు లభిస్తాయి. డిడిలు పదోన్నతులు పొందితే అసిస్టెంట్‌ డైరెక్టర్లకు కూడా పదోన్నతులు లభిస్తాయి. ఆరోగ్య శాఖ వెంటనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని అధికారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల్లో ప్రభుత్వం నియమించిన ఆర్డీవోల్లో చాలా మంది గ్రూప్‌-2 అధికారులే. ఆరోగ్యశాఖలో అసిస్టెంట్‌ డైరెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నవారిలో చాలా మంది గ్రూప్‌-1 కేడర్‌ వారు. దీంతో గ్రూప్‌-2 అధికారి కింద గ్రూప్‌-1 అధికారి పని చేయాల్సి వస్తోంది. ఆరోగ్యశాఖలో అధికారులు రెవెన్యూ అధికారులను వ్యతిరేకించడానికి ఇది కూడా ప్రధాన కారణం.


జీవోకు తూట్లు..

ఆరోగ్యశాఖ ఇచ్చిన జీవో 178కు అధికారులే తూట్లు పొడిచారు. ఆ జీవో ప్రకారం అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల్లో స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను నియమించాలి. కానీ ఆర్డీవోలతో భర్తీ చేశారు. పైగా 50 ఏళ్లలోపు వయసు ఉండాలన్న నిబంధనను ఉల్లంఘించారు. అడ్మినిస్ట్రేటర్‌ పోస్టుల్లో నియమించిన ఆర్డీవోల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా 50 ఏళ్లు పైబడిన వారే. కేవలం ఆరోగ్య శాఖలో గ్రూప్‌-1 అధికారుల పదోన్నతులకు దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకువచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Dec 08 , 2024 | 04:03 AM