Share News

మీ మానసిక స్థితిపై నాకు భయంగా ఉంది

ABN , Publish Date - May 05 , 2024 | 04:23 AM

జగన్‌ గారూ... మీ కోసం అద్దం పంపుతున్నా. ఆ అద్దంలో చూడండి. మీకు మీ ముఖం కపిపిస్తుందా? చంద్రబాబు ముఖం కనిపిస్తుందా?

మీ మానసిక స్థితిపై నాకు భయంగా ఉంది

జగన్‌... అద్దం పంపిస్తున్నా చూసుకో

అందులో మీకు ఎవరి ముఖం కనిపిస్తోంది?

చంద్రబాబుదా... మీదా..?

నేను బాబుతో చేతులు కలిపానా!

వైఎస్సార్‌ బిడ్డను... ఎంత మొండిదాన్నో మీకు తెలుసు

నన్ను ఎవరూ కంట్రోల్‌ చేయలేరు

కడపను, ప్రభుత్వ భూములను దోచేశారు

చట్ట సభల్లో నిందితులు అడుగుపెట్టకూడదు

అందుకే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా: షర్మిల

కడప, మే 4(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ గారూ... మీ కోసం అద్దం పంపుతున్నా. ఆ అద్దంలో చూడండి. మీకు మీ ముఖం కపిపిస్తుందా? చంద్రబాబు ముఖం కనిపిస్తుందా? నేను చంద్రబాబుతో చేతులు కలిపినట్లు, ఆయన కంట్రోల్‌ చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క సాక్ష్యమై నా, ఒక్క ఆధారమైనా చూపించగలరా? మీరు ఒక భ్రమలో ఉన్నారు. మీ వైఖరి మాలోకాన్ని తలపిస్తోంది. జగన్‌... మీ మానసిక పరిస్థితిపై నాకు ఆందోళనగా ఉంది’’ అని ఏపీసీసీ చీఫ్‌, కడప పార్లమెంటు అభ్యర్థి వైఎస్‌ షర్మిల అన్నారు. శనివారం కడపలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలోనూ, వివేకా కూతు రు డాక్టర్‌ సునీత, కడప కాంగ్రెస్‌ అభ్యర్థి అఫ్జల్‌ఖాన్‌తో కలసి పాల్గొన్న రోడ్‌షోలోనూ ఆమె మాట్లాడారు. ‘నా జన్మకు నేను చంద్రబాబును ఒక్కసారి మాత్ర మే కలిశాను. నా కొడుకు పెళ్లికి పిలవడానికి వెళ్లాను. కానీ నేను చంద్రబాబుతో చేతులు కలిపానని, ఆయన కంట్రోల్‌లో ఉన్నానంటూ జగన్‌ ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నాడు. నేను చంద్రబాబు చెబితేనే నీ కోసం 3,500 కి.మీ పాదయాత్ర చేశానా? బై బై బాబు అని క్యాంపెయిన్‌ చేశానా? సునీత, రేవంత్‌రెడ్డి కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారంట. బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మేనేజ్‌ చేశాడంట. చంద్రబాబును ఎవరు పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలి’ అని షర్మిల అన్నారు.

వైఎస్సార్‌ పేరును చార్జిషీటులో చేర్పించింది పొన్నవోలు

‘వైఎస్సార్‌ పేరును చార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్‌ కాదు. జగన్‌ మనిషి. పొన్నవోలుతో పిటిషన్‌ వేయించి మరీ చేర్పించాడు. నిజానికి కేసు వేసింది మాజీ మంత్రి శంకర్‌రావు. కానీ కేసు చెల్లలేదు. ఎర్రన్నాయుడు వేసిన పిటిషన్‌ కోర్టు ఇంప్లీడ్‌ చేసింది. విచారణ చేయమని మాత్రమే ఆనాడు కోర్టు చెప్పింది. కానీ వైఎస్‌ పేరును అప్పటి పిటిషన్‌లో చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్‌ సుప్రీంకు వెళ్లి పేరు చేర్పించారు. అందుకే జగన్‌ గుట్టుగా పొన్నవోలుకు పదవి ఇచ్చాడు. సీఎం అయిన ఆరు రోజులకే పోసింగ్‌ లెటరు ఇచ్చాడు. ఏ సంబంధం లేకుంటే ఆయనకు ఎందుకు పదవి ఇచ్చారు? కళ్ల ఎదుట అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది కాంగ్రె్‌సకు, సీబీఐకి చార్జిషీట్‌కు సంబంధం లేదని’ అని షర్మిల స్పష్టం చేశారు.


నేను జగమొండి...

‘సునీత చేస్తున్న న్యాయ పోరాటం మీకు కనిపించలేదా? వివేకా హత్య వెనుక అవినాశ్‌రెడ్డి హస్తం లేకుంటే ఎందుకు మీకింత భయం? నేను చంద్రబాబు మనిషిని అంటున్నారు. నన్ను ఆయన కంట్రోల్‌ చేస్తున్నాడంట. నేను బాబు మాట వింటున్నానంట. నేను వైఎస్సార్‌ బిడ్డను. నేను ఎంతటి మొండిదాన్నో జగన్‌కు తెలుసు. నేను ఎవరో కంట్రోల్‌ చేస్తే తిరిగేదానిని కాను’ అని షర్మిల స్పష్టం చేశారు.

నిజాలు ఇప్పుడే తెలిశాయి

‘మమ్మల్ని ఈ విషయంలో ఊసరవెల్లి అంటున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ కేసు పెట్టిందని నేను చెప్పినట్లు వీడియోలు ప్లే చేస్తున్నారు. నిజానికి ఆరోజు నాకు ఏం తెలియదు. సోనియాను కలిశాక విషయాన్ని తెలుసుకున్నా. ఈ మధ్య ఉండవల్లిని కలిసినప్పుడు మరింత తెలుసుకున్నా. జగనే కావాలని పెట్టించినట్లు స్పష్టం చేశా రు. అన్ని నిజాలూ తెలుసుకున్న తరువాతనే కాంగ్రెస్‌ పెట్టలేదని నేను చెబుతున్నా. వివేకా హత్య తరువాత చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం అయ్యాక సీబీఐ విచారణ వద్దన్నారు. నిజంగా చంద్రబాబు హస్తం ఉంటే ఎందుకు సీబీఐ విచారణ వద్దన్నారు? మీరు అప్పుడొక మాట, ఇప్పుడొక మాట మాట్లాడతారా?’ అని షర్మిల మండిపడ్డారు.

వైసీపీ నేతలంతా ముఠాలుగా తయారయ్యారు

‘గత ఎన్నికల్లో అందరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేశారు. ఇచ్చిన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. మీకు ఇచ్చిన అధికారాన్ని అక్రమాలకు వాడుకున్నారు. ఈనాటి కడప అభివృద్ధి అంతా దివంగత వైఎస్‌ చేసిందే. వైసీపీ పాలనలో కడప అభివృద్ధి శూన్యం. కనీసం మంచినీరు ఇవ్వలేని పరిస్థితి. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయరు సురేశ్‌బాబు, ఎమ్మెల్యే రవీంద్రనాఽథరెడ్డి, మల్లికార్జునరెడ్డి అంతా కలసి కడపను, ప్రభుత్వ భూములను దోచుకున్నారు. మద్యంలో తప్ప అభివృద్ధి లేదు. వివేకానందరెడ్డిని, అవినాశ్‌రెడ్డి చంపించారంటూ సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయి. కానీ జగన్‌ తన పదవిని అడ్డుపెట్టుకుని మరీ కాపాడారు. చట్టసభల్లో నిందితులు అడుగు పెట్టకూడదు. అందుకే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా’ అని షర్మిల అన్నారు.


రాష్ట్రంలో 20.19 లక్షల మందిమాదకద్రవ్యాలకు బానిసలు

సీఎం జగన్‌కు షర్మిల 4వ లేఖాస్త్రం

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్మోహన్‌రెడ్డీ... ‘రాష్ట్రంలో మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తా. ఆ తరువాతే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతా’ అని మీరు చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు?’’ అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. ‘న్యాయ నవ సందేహాలు’ పేరిట షర్మిల సీఎం జగన్‌కు శనివారం 4వ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో... 1) మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగా అయినా అమలవుతోందా? 2) మూడు దశల్లో మద్య నిషేధాన్ని అమలు చేస్తామన్నారు. ఏమయింది? 3) మద్యం అమ్మకాలు రూ.20,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెరిగాయి. దీనిని ఎలా చూస్తారు? 4) ‘మద్యం ద్వారా ఆదాయం అంటే ప్రజల రక్తమాంసాల మీద వ్యాపా రం’ అన్నారు. మరి మీరు చేస్తున్నదేంటి? 5) ఎక్కడా దొరకని ‘జే’ బ్రాండ్‌ మద్యం రాష్ట్రంలోనే అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటంఆడుతున్నారు? 6) బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చేయూత, ఆసరా, అమ్మఒడి పథకాల అమలు బాధ్యతను అప్పగించడాన్ని ఎలా సమర్థిస్తారు?, 7) కేంద్రం వద్దంటున్నా బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.11,000 కోట్ల రుణం తీసుకోవాలని ఎలా అనుకున్నారు? ప్రయత్నించి భంగపడిన మాట వాస్తవం కాదా? 8) దేశం లో గం జాయి ఇతర మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకు ఉంటోంది?, 9) రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారంటూ కేంద్రం నివేదిక ఇవ్వడాన్ని ఏమంటారు..! అది మీ వైఫల్యం కాదా?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.

Updated Date - May 05 , 2024 | 04:23 AM